ప్రపంచాన్ని వణికి స్తున్న కరోనా వైరస్‌.. భారత్‌లోనూ రోజురోజుకు విజృంభిస్తుంది. ఈ వైరస్‌ ప్రభావంతో వందల సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 492 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, మృతుల సంఖ్య పదికి చేరింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించారు. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా కేంద్రం చర్యలు తీసుకుటుంది. తద్వారా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ ప్రభావం అన్ని రంగాలపై పడుతుంది. ఇప్పటికే రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. రైళ్లు నిలిచిపోయాయి. ఈనెల 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ నిర్ణయించింది.

తాజాగా కరెన్సీ నోట్ల ముద్రణపైనా కరోనా ప్రభావం పడింది. ఈనెలాఖరు వరకూ నోట్ల ముద్రణ నిలిచిపోనుంది. భారత సెక్యూరిటీ ప్రెస్‌ (ఐఎస్‌పీ), కరెన్సీ నోట్‌ ప్రెస్‌ (సీఎన్‌పీ)లకు సంబంధించి అన్ని కార్యకలాపాలనూ ఈ నెలాఖరు వరకూ వేసివేయనున్నారు. కరోనా వైరస్‌ దేశంలో రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాసిక్‌లోని భారత సెక్యూరిటీ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఐఎస్‌పీ లో 1900 మంది సిబ్బంది ఉండగా, సీఎన్‌పీలో 2100 మంది పనిచేస్తున్నారు. అయితే ఈ రెండు యూనిట్లలో అగ్నిమాపక సిబ్బంది, భద్రతా సిబ్బంది విధినిర్వహణలో ఉంటారని అధికారులు తెలిపారు.

గతంలో రెండు దఫాలుగా నెల రోజుల పాటు ఈ సంస్థలు మూతపడ్డాయి. 1950లో కార్మికుల సమ్మెతో ఐఎస్‌పీ ఒక నెలపాటు మూతపడింది. 1979లో కార్మికులు సమ్మె చేయడంతో ఐఎస్‌పీ, సీఎన్‌పీ రెండూ నెల రోజుల పాటు మూతడ్డాయి. ఇదిలా ఉంటే ఈ నెల 31తరువాత కరోనా వైరస్‌ తీవ్రతను బట్టి మూసివేత కాలం పొడగించడమా, లేదా అనేది నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.