చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక భారత్‌లో కూడా చాపకింద నీరులా వ్యాపించి అతలాకుతలం చేస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక తాజాగా సీఆర్పీఎఫ్‌ బెటాలియన్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలోని 68 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరంతా దేశ రాజధానిలోని ఈస్ట్‌ ఢిల్లీలో ఉన్న 31వ సీఆర్పీఎఫ్‌ బెటాలియన్‌కు చెందిన వారు. ఇప్పటికే కొంతమంది జవాన్లకు కరోనా పాజిటివ్‌ రాగా, ఇప్పుడు మరో 68 మందికి కరోనా సోకడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో ఇప్పటి వరకూ 122 మంది జవాన్లకు కరోనా పాజిటివ్‌ తేలగా, ఒకరు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, మరో జవాన్‌ మరణించాడు.

కాగా, పారామిలటరీకి చెందిన ఓ మెడికల్‌ అసిస్టెంట్‌ ద్వారా సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా సోకినట్లు అధికారులు తేల్చారు. మరో వైపు కరోనా మహమ్మారితో ఢిల్లీ డేంజర్‌ జోన్‌గా మారిపోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఢిల్లీలోని అన్ని జోన్లను రెడ్‌ జోన్‌లుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.