Shamshabad: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla
Shamshabad: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
కర్ణాటకలోని బీదర్‌కు చెందిన ఒక కుటుంబం జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చింది. శంషాబాద్‌లోని ఆర్బీనగర్‌లో నివాసం ఉంటున్నారు. భర్త కొరియర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. ప్రియాంక తన భర్తతో గొడవపడింది. ఏం జరిగిందో తెలియదు కానీ.. గొడవ పెద్దది కావడంతో మనస్తాపం చెందింది. దాంతో.. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి.. ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త డ్యూటీ అయిపోయాక ఇంటికి వచ్చి చూసేసరికి పిల్లలు స్పృహ కోల్పోయి.. భార్య ఉరివేసుకుని ఉండటం చూశాడు. వెంటనే స్థానికుల సాయంతో పిల్లలను ఆస్పత్రికి తరలించాడు.
ప్రియాంక చనిపోగా.. ఇద్దరు చిన్నారులు రెండేళ్ల బాబు అద్విక్, 9 నెలల పాప ఆరాధ్యను నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ తాగాదాలే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.