ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. తమ పశువులకు మేత సేకరించి ఇంటికి తిరిగి వస్తుండగా వీధికుక్కల గుంపు దాడి చేయడంతో 30 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడింది. తీవ్ర గాయాలపాలైన మహిళ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. నథియా అనే మహిళను కుక్కలు కరిచిన ఘటన హసన్‌పూర్ పోలీస్ సర్కిల్ పరిధిలోని బిజ్నౌరా గ్రామంలో చోటుచేసుకుంది. ఆమె ముఖం, కడుపు, గొంతుపై లోతైన గాయాలున్నాయి. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు హసన్‌పూర్ కమ్యూనిటీ సెంటర్‌కు తరలించారు, కాని అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ప్రాంతంలో కుక్కల గుంపులు దారుణంగా ఉన్నాయని, ప్రజల ప్రాణాలను తీసేలా కిరాతకంగా మారాయని గ్రామస్తులు తెలిపారు. పొరుగున ఉన్న కనాట, దీప్‌పూర్, రాంపూర్, భాభా గ్రామాల ప్రజలపై గతంలో కుక్కలు దాడి చేశాయి.
గత ఏడాది డిసెంబర్‌లో హుస్సేన్‌పూర్ గ్రామంలో చెత్త వేయడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన 15 ఏళ్ల బాలికను ఆమె ఇంటి సమీపంలోని వీధికుక్కల గుంపు కొరికి చంపింది. చిన్న పిల్లలపై కుక్కలు దాడులు చేయడం చాలా తరచుగా జరుగుతుండగా.. ఇలా పెద్దలపై దాడి చేసి చంపడం చాలా అరుదని అంటున్నారు. స్థానిక యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాబోయే ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రజలు తేల్చి చెప్పారు.