ఇన్‌స్టా రీల్స్ చేయొద్దన్నందుకు భర్తను చంపిన భార్య
రీల్స్ చేయడం ఆపాలని చెప్పాడని కోపంతో భర్తనే హత్య చేసింది భార్య.
By Srikanth Gundamalla Published on 8 Jan 2024 8:45 PM ISTఇన్‌స్టా రీల్స్ చేయొద్దన్నందుకు భర్తను చంపిన భార్య
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని చాలా మంది అనుకుంటుంటారు. కొందరు సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి సినిమాల్లో చాన్సులు కొట్టేసినవారూ ఉన్నారు. ఇంకొందరు డబ్బులు బాగానే సంపాదిస్తుంటారు. అయితే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం కొందరికి నచ్చకపోవచ్చు. ఈ క్రమంలోనే ఓ భర్త కూడా భార్యకు ఇదే చెప్పాడు. భార్య సోషల్ మీడియాలో నిత్యం రీల్స్ అప్‌లోడ్ చేస్తుండటం తనకు నచ్చలేదు. ఇదే విషయాన్ని చెప్పాడు. ఆమె రీల్స్ చేయడం ఆపాలని చెప్పాడని కోపంతో భర్తనే హత్య చేసింది.
ఈ దారుణ సంఘటన బీహార్‌లోని ఖోడాబంద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫఫౌట్ గ్రామంలో చోటు చేసుకుంది. మహేశ్వర్ అనే వ్యక్తి కోల్‌కతాలో కూలీగా పనిచేస్తుండేవాడు. కొద్ది రోజుల క్రితమే తన స్వగ్రామం సమస్తిపూర్ జిల్లాలోని నర్హన్‌కు వచ్చాడు. అయితే..రాణికుమారితో ఏడేళ్ల క్రితమే మహేశ్వర్ వివాహం జరిగింది. స్వగ్రామానికి వచ్చిన అతను తన భార్య నిత్యం రీల్స్ చేస్తుండటాన్ని చూశాడు. పలుమార్లు గమనించి ఇక నుంచి రీల్స్ చేయొద్దని చెప్పాడు. అది అతనికి నచ్చడం లేదని తెలిపాడు. ఆదివారం కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. దాంతో.. ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఆ వెంటెనే రాణికుమారి తన తల్లిదండ్రుల గ్రామం ఫఫౌట్‌కు వెళ్లింది. ఆ తర్వాత మహేశ్వర్ కూడా భార్యవెనకాలే ఫఫౌట్‌కు వెళ్లాడు. మరోసారి ఇన్‌స్టా విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో.. రాణి, ఆమె తల్లిదండ్రులతో కలిసి మహేశ్వర్ గొంతు కోసి హత్య చేసింది. కోల్‌కతా నుంచి మృతుడి సోదరుడు ఫోన్ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా.. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రాణిని అదుపులోకి తీసుకున్నారు.