దారుణం: నాలుక కోసి తల్లిని హత్య చేసిన కొడుకు

మద్యం తాగొద్దని మంచి మాట చెప్పినందుకు తల్లినే హతమార్చాడు ఓ కసాయి కొడుకు.

By Srikanth Gundamalla  Published on  15 Sep 2023 6:15 AM GMT
Vizianagaram, murder, mother, Arrested,

దారుణం: నాలుక కోసి తల్లిని హత్య చేసిన కొడుకు

నవ మోసాలు మోసి పెంచిన తల్లిని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. తల్లి బిడ్డ మంచి కోసమే ఆలోచిస్తుంది. ఏదైనా చెబితే బిడ్డ భవిష్యత్‌ బాగుండాలనే ఆలోచించి సూచనలు ఇస్తుంది. కానీ.. కొందరు తాగుడికి అలవాటు పడి తల్లిని కూడా పట్టించుకోవడం లేదు. కొందరైతే తల్లిదండ్రులు వృద్ధులైనా లెక్క చేయకుండా ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ చిత్రహింసలు పెడుతున్నారు. డబ్బులు అడిగినంత ఇవ్వకపోతే దాడులు చేస్తున్నారు. తాజాగా.. విజయనగరం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. మద్యం తాగొద్దని మంచి మాట చెప్పినందుకు తల్లినే హతమార్చాడు ఓ కసాయి కొడుకు.

విజయనగరం జిల్లా రామభద్రాపురం వసంతల వీధిలో రమణమ్మ నివసిస్తోంది. అతడికి శ్రీనివాసరావు అనే కుమారుడు ఉన్నాడు. శ్రీనివాసరావు మద్యానికి బానిసయ్యాడు. రోజూ ఇంటికి తాగే వస్తున్నాడు. కొడుకు చెడిపోవడం చూసి తట్టుకోలేక తల్లి రమణమ్మ మద్యం తాగొద్దని.. మంచిగా బతకాలంటూ రోజూ చెప్తూ వచ్చింది. కానీ.. తల్లి మాటల శ్రీనివాసరావు అస్సలు వినలేదు. పైగా మద్యం మత్తులో తల్లిపై దాడి చేసేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల కూడా శ్రీనివాసరావు తాగే ఇంటికి వచ్చాడు. రమణమ్మ మరోసారి అతడిని మందలించింది. దాంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీనివాసరావు తల్లిపై తీవ్రంగా దాడి చేశాడు. ఆ తర్వాత ఆమె నాలుకను కోసేశాడు. తల్లి నాలుకను తీసుకెళ్లి పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు.

దాంతో.. శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తల్లిని చంపిన శ్రీనివాసరావుని కఠినంగా శిక్షించాలంటూ రమణమ్మ కుటుంబ సభ్యులు కూడా డిమాండ చేస్తున్నారు. తల్లిని చంపిన పాపాత్ముడిని వదలొద్దంటూ పోలీసులను కోరుతున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Next Story