Vikarabad: దారుణం.. తల్లిని చంపి చెరువులో పడేసిన కొడుకు

వికారాబాద్‌ జిల్లాలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. ఓ కొడుకు తల్లిని హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on  27 Oct 2023 3:00 PM IST
vikarabad, son murder, mother, khasimpur,

 Vikarabad: దారుణం.. తల్లిని చంపి చెరువులో పడేసిన కొడుకు

వికారాబాద్‌ జిల్లాలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. ఓ కొడుకు తల్లిని హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో తల్లిని చంపిన నిందితుడు ఆ తర్వాత డెడ్‌బాడీని చెరువులో పడేశాడు. అయితే.. కొద్ది రోజుల క్రితమే జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఖాసింపూర్‌లో చోటుచేసుకుంది ఈ ఘటన. అంజలమ్మ అనే మహిళకు 45 ఏళ్లు. ఈమెకు ఇద్దరు కుఆరులు ఉన్నారు. పెద్ద కొడుకు సతీష్, చిన్న కొడుకు వెంకటేశ్‌. వీరిద్దరికీ వివాహాలు జరిగిపోయాయి. చిన్నకొడుకు వెంకటేశ్‌ అదే గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక సొంత ఇంటిని నిర్మించుకున్నాడు. మొదట వెంకటేశ్‌ తాండూర్‌లోని ఓ టిఫిన్ సెంటర్‌లో పని చేసేవాడు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే తల్లి అంజలమ్మ ఖాసింపూర్‌లోనే కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తోంది.

అంజలమ్మ చిన్న కొడుకు తన ఇంటి నిర్మాణం జరుగుతున్న సమయంలో గ్రామంలో పలువురి దగ్గర అప్పులు తీసుకున్నాడు. అయితే.. వారికి ఆ డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో వారు గ్రామంలోనే ఉన్న వెంకటేశ్‌ తల్లి అంజలమ్మను నిలదీశారు. దాంతో.. తాను చేసేదేం లేక దసరా పండుగకి తన కుమారుడు ఇంటికి వస్తాడని.. వచ్చాక అతన్నే డబ్బులు అడగండి అనీ.. తనకేమీ తెలియదని చెప్పుకొచ్చింది. ఆమె సమాధానంతో అప్పుల వారూ వెనక్కి తగ్గి వెళ్లిపోయారు. ఇక దసర పండగకు వెంకటేశ్‌ స్వగ్రామానికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వెళ్లి వెంకటేశ్‌ను నిలదీశారు. దాంతో అవమానభారంగా ఫీలయిన వెంకటేశ్‌.. తాను గ్రామానికి వచ్చిన విషయం తల్లే వారికి చెప్పిందని ఆమెపై కోపం పెంచుకున్నాడు. అదే రోజు రాత్రి పీకలదాకా తాగి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో తల్లి గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని గొనె సంచిలో కట్టి వాగులో పడేశాడు.

తల్లి కనిపించడం లేదంటూ పెద్ద కొడుకు సతీష్ ఆందోళన చెందాడు. తమ్ముడు వెంకటేశ్‌ను గట్టిగా నిలదీసి అడిగాడు. అప్పుడు నిజం బయటపడింది. దాంతో వెంకటేశ్‌పై అన్న సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు స్థానిక చెరువులో అంజలమ్మ మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం కోసం డెడ్‌బాడీని ఆస్పత్రికి తరలించారు. అనంతరం.. నిందితుడు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నామని.. విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.

Next Story