ఏడాది నుంచి తల్లి మృతదేహంతో ఇంట్లో ఉంటోన్న కూతుళ్లు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో దారుణం చోటుచేసుకుంది. ఏడాది క్రితం తల్లి చనిపోయింది.
By Srikanth Gundamalla Published on 1 Dec 2023 6:32 AM GMTఏడాది నుంచి తల్లి మృతదేహంతో ఇంట్లో ఉంటోన్న కూతుళ్లు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో దారుణం చోటుచేసుకుంది. ఏడాది క్రితం తల్లి చనిపోయింది. అయితే.. ఆమె చనిపోయిన విషయాన్ని ఇద్దరు కూతుళ్లు బయట ఎవరికీ చెప్పలేదు. ఏడాది నుంచి ఇంట్లోనే ఉంచుకున్నారు. చివరకు మృతురాలికి చెందిన బంధువు ఇంటికి రావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి మదర్వా ప్రాంతానికి చెందిన ఉషా త్రిపాఠి అక్కడే నివాసం ఉంటోంది. ఈమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురి పేరు పల్లవి (27), చిన్నకూతురు పేరు వైశ్విక్ (17). ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే.. పల్లవి పీజీ చదువుకుంది. వైశ్విక్ మాత్రం పదో తరగతి చదువుతోంది. రెండేళ్ల క్రితమే ఉషా త్రిపాఠి భర్త చనిపోయాడు. దాంతో.. ఉషా త్రిపాఠినే కుటుంబ పోషణ చూసుకుంటోంది. తాము నివసిస్తోన్న ప్రాంతంలోనే చిన్న దుకాణం తెరిచి బతుకుదెరువు కొనసాగించింది. గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన ఉషా అనారోగ్యంతో చనిపోయింది. ఈ విషయం అక్కాచెళ్లెలు బయట ఎవరికీ చెప్పలేదు. మృతదేహాన్ని ఇంట్లోనే ఆమె గదిలో ఉంచారు.
ఏడాది పూర్తికావొస్తున్నా తమ తల్లి చనిపోయిన విషయం బయటకు రానివ్వలేదు. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. తమకు కావాల్సిన వస్తువుల కోసం మాత్రమే బయటకు వెళ్లి వచ్చేవారు. ఆ తర్వాత తలుపు గడియ పెట్టుకుని అస్సలు బయటకు వచ్చేవారు కాదు. కాగా.. తాజాగా మీర్జాపూర్‌లో ఉంటోన్న ధర్మేంద్రకుమార్ ఉషా త్రిపాఠికి బంధువు కావడంతో.. ఆమెను చూడటానికి వారణాసికి వచ్చాడు. తన సోదరి ఇంటి వద్దకు వెళ్లి డోర్ కొట్టాడు. కానీ ఎవరూ స్పందించలేదు. లోపల గడియ పెట్టుకుని అక్కాచెళ్లెళ్లు ఉండిపోయాడు. తలుపులను ఎంత బాదినా తీయకపోవడంతో అనుమానం వచ్చిన ధర్మేంద్ర.. స్థానిక పోలీసులకు విషయం చెప్పాడు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టారు. లోపలికి వెళ్లి చూశారు. ఇంట్లోని ఒక గదిలో మహిళ అస్థిపంజరాన్ని గుర్తించారు. మరో గదిలో అక్కా చెళ్లెళ్లు ఇద్దరూ ఉన్నారు.
కాగా.. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇద్దరి అక్కాచెల్లెళ్ల మానసిక పరిస్థితి బాగోలేదని దర్యాప్తులో తేలిందని తెలిపారు పోలీసులు. కానీ.. తల్లి చనిపోయిన తేదీని మాత్రం వారు గుర్తు పెట్టుకున్నారనీ.. ఇది కాస్త అనుమానం కలిగించే విషయమని అన్నారు. కాగా.. పల్లవి, వైశ్విక్‌లను వైద్య పరీక్షల కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించారు.