రైళ్ల ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా వేటను కొనసాగిస్తూ ఉన్నారు అధికారులు. కర్ణాటకలోని గవర్నమెంట్ రైల్వే పోలీసులు శనివారం కాకినాడ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడి నుండి 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో నిందితుడిని అడ్డుకుని.. ఆ లగేజీని సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్‌లో రూ.4 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
21 కిలోల గంజాయి స్వాధీనం, నిందితుడి అరెస్ట్
జీఆర్పీ కర్ణాటక సూపరింటెండెంట్ డీ.ఆర్. సిరి గౌరి మాట్లాడుతూ, "కాకినాడ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి మార్చి 5న బెంగుళూరుకు గంజాయిని తీసుకువచ్చినట్లు మాకు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. రైలు బెంగళూరు కంటోన్మెంట్‌కు ఉదయం 11.30 గంటలకు చేరుకున్నప్పుడు మా పోలీసులు స్టేషన్‌లో సాధారణ తనిఖీలు చేస్తున్నారు, ఒక ప్రయాణీకుడు టెన్షన్ తో రైలు నుండి బయటకు వచ్చాడు. అతని లగేజీని పోలీసులు పరిశీలించగా, ఒక సూట్‌కేస్‌లో 16 కిలోల గంజాయి. మరో ట్రావెల్ బ్యాగ్‌లో 5 కిలోల గంజాయి కనిపించింది, తరువాత అతన్ని అరెస్టు చేశాం" అని ఎస్పీ తెలిపారు.
తమిళనాడు నుంచి ఆ గంజాయిని తీసుకువస్తున్నట్లు అనుమానిస్తున్నారు. న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, వ్యక్తిని రాజ్‌కుమార్ రాజేంద్రన్‌గా గుర్తించారు. అతనిపై నార్కోటిక్స్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ డ్రగ్స్ చట్టం కింద కేసు నమోదు చేయబడింది.