Hyderabad: పోలీసు తనిఖీల పేరుతో రూ.18 లక్షలు కొట్టేసిన దొంగలు
పోలీసుల తనిఖీల పేరుతో హైదరాబాద్‌లో కొందరు దొంగలు దోపిడీకి పాల్పడుతున్నారు. రూ.18లక్షలు ఎత్తుకెళ్లారు.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 1:30 PM GMTHyderabad: పోలీసు తనిఖీల పేరుతో రూ.18 లక్షలు కొట్టేసిన దొంగలు
ఎలక్షన్ కోడ్ అంటూ వెహికల్స్ చెక్ చేస్తారు. కార్లలో ఉన్న నగదును సీజ్ చేస్తున్నామని నమ్మిస్తారు. నిమిషాల్లో అక్కడి నుండి ఉడాయిస్తారు. వచ్చింది పోలీసులు కాదు... ఎలక్షన్ అధికారులు కాదు... పోనీ ఐటి అధికారులేమో అనుకుంటే అదీ పొరపాటే. అయితే.. అలా మోసపోతున్నవారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. చివరకు ప్రూఫ్ చూపిస్తే డబ్బులు తిరిగి ఇస్తారు కదా అనుకుని పోలీసుల వద్దకు వెళ్తే.. నగదు సీజ్ చేసినవారు అసలు ప్రభుత్వ అధికారులు కాదని తెలియడంతో ఖంగుతింటున్నారు.
అయితే ఇటువంటి ముఠాలు ముందుగా డబ్బులు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి..? ఏ వెహికల్ లో వెళ్తున్నాయి..? ఎక్కడినుండి ఎక్కడికి వెళ్తున్నారు..? కార్లలో ఎంతమంది ఉన్నారనే విషయాలపై ముందుగా రెక్కి నిర్వహించి అనంతరం పోలీసుల మాదిరిగా వెహికల్స్ చెక్ చేసి కారులో ఉన్న డబ్బులను తీసుకొని అక్కడినుండి మెల్లిగా జారుకుంటున్నారు. ఇటువంటి గ్యాంగ్స్ పోలీసులకు తలనొప్పిగా మారారు. ఇటువంటి సంఘటనే హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. బేగంబజార్ కు చెందిన ఒక వ్యాపారి, డ్రైవర్‌తో పాటు మరో ఉద్యోగితో కలిసి కార్లో 20 లక్షల రూపాయలు పెట్టుకొని వెళ్తూ ఉండగా... బంజారా హిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే ఎదురుగా ఒక పోలీస్ వాహనం వచ్చి ఆగింది. ఎలక్షన్ కోడ్ లో భాగంగా తనిఖీలు చేయాలని చెప్పారు. అనంతరం కారు చెక్ చేసి కార్లో ఉన్న రూ.20 లక్షలు సీజ్ చేశామని చెప్పారు. ఆ తర్వాత ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళాక వారికి బ్యాగ్ ఇచ్చేశారు. దీంతో ఆనందపడిన డ్రైవర్, ఉద్యోగి బ్యాగు తెరిచి చూడగా అందులో కేవలం లక్ష యాభై వేలు రూపాయలు మాత్రమే ఉన్నాయి.
అయితే సీజ్ చేసిన డబ్బులకు లెక్క చూపిస్తామంటూ వ్యాపారి డ్రైవర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అయితే మేము ఏ నగదు సీజ్ చేయలేదని పోలీసులు చెప్పడంతో డ్రైవర్, ఉద్యోగి ఒక్కసారిగా అవాక్కయ్యారు. అనంతరం తాము మోసపోయామని గ్రహించిన డ్రైవర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాధితులు చెప్పినట్లుగా నిజంగానే పోలీసుల వాహనం వచ్చిందా? ఎవరైనా ఎలక్షన్ అధికారులు వచ్చి మనీ సీజ్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేశారు. మరోవైపు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
అయితే..వీరి వద్ద నుంచి బ్యాగ్ లో ఉన్న రూ.18.50 లక్షలు తీసుకున్నవారు సైదాబాద్, చంపాపేట్ వైపు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. కొందరు దుండగులు ఈ మోసాలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో నిందితుల్లో కానిస్టేబుల్ కూడా ఉన్నట్లుగా గుర్తించారు. డబ్బులు తీసుకెళ్తున్న వారికి, దోచుకున్న వారికి మధ్య ఏమైనా లింకులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఎలక్షన్ సమయంలో ఏ అధికారి డబ్బులు సీజ్ చేసిన కూడా ఆ సమయంలోనే పంచనామా రాస్తారు. అధికారులకు సమాచారం ఇస్తారు. డబ్బులు ఎక్కడికి తీసుకెళ్తున్నామనే విషయాన్ని కూడా స్పష్టంగా వ్యక్తం చేయడమే కాకుండా వారిని పోలీస్ స్టేషన్ కూడా తీసుకువెళ్లడం జరుగుతుందని పోలీసులు స్పష్టం వ్యక్తం చేశారు. ప్రజలు ఎవరు కూడా మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.