హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్‌లో దోపిడీ దొంగల బీభత్సం

నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం చాగొల్లు దగ్గర రైళ్లలో దొంగలు రెచ్చిపోయారు.

By Srikanth Gundamalla  Published on  14 Aug 2023 6:10 AM GMT
Theft,  Hyderabad express, Train, Case Booked,

హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్‌లో దోపిడీ దొంగల బీభత్సం 

నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం చాగొల్లు దగ్గర రైళ్లలో దొంగలు రెచ్చిపోయారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఏడుగురు ప్రయాణికుల మెడల నుంచి బంగారపు చైన్లు లాక్కున్నారు. వీరేపల్లి దగ్గర హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆపి అక్కడి నుంచి పరారు అయ్యారు. అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో ఈ దోపిడీ చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత హైదరాబాద్‌ నుంచి తాంబరం వెళ్తున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లోనూ దొంగలు దోపిడీకి విఫలయత్నం చేశారు.

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా ఉలవపాడు-తెట్టు రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఉలవపాడు పరిధిలోని సుబ్బరాయుడు సత్రం గేటు వద్ద ఆరుగురు దుండగులు నిలిపివేశారు. అనంతరం దొంగలు రైల్‌లోకి ప్రవేశించి.. మహిళల మెడల నుంచి సుమారు 30 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎస్‌-1, ఎస్‌-2, ఎస్‌-3 బోగీల్లో దొంగతనం జరిగింది. చోరీ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత తెట్టు దగ్గర చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేశారు దొంగలు. అందులోనూ దొంగతనానికి ప్రయత్నం చేశారు. కానీ.. రైల్‌లోని పోలీసులు అప్రమత్తం అయ్యారు. దొంగలను ఎదుర్కొన్నారు. భయంతో దొంగలు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయారు. కేవలం గంట వ్యవధిలోనే రెండు రైళ్లలో ఈ ఘటనలు జరిగాయి. దాంతో.. ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దొంగలు పారిపోయిన తర్వాత చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ యథావిధిగా వెళ్లిపోయింది. ప్రయాణికులు ఒంగోలులో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను గుర్తించే పనిలో పడ్డారు.

Next Story