లండన్‌లో తెలుగమ్మాయిలపై ఉన్మాది ఘాతుకం.. ఒకరు మృతి

విదేశీ విద్య కోసం లండన్ వెళ్లిన ఇద్దరు తెలుగమ్మాయిలపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక యువతి మరణించగా

By Srikanth Gundamalla  Published on  14 Jun 2023 2:28 PM IST
Brazil, London, Telugu Girls, Murder, Girl Dead

లండన్‌లో తెలుగమ్మాయిలపై ఉన్మాది ఘాతుకం.. ఒకరు మృతి

విదేశీ విద్య కోసం లండన్ వెళ్లిన ఇద్దరు తెలుగమ్మాయిలపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక యువతి మరణించగా.. మరో యువతి తీవ్రగాయాలపాలైంది.

విదేశాల్లో చదివి.. మంచి ఉద్యోగంలో చేరి.. బాగా సంపాదించాలనేది చాలా మంది యువతీయువకుల కల. ఇప్పుడు యువత ఎక్కువగా విదేశాల్లో చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే లండన్‌ వెళ్లి బాగా చదువుకుని సెటిల్‌ అవ్వాలని కలలు కన్న ఇద్దరు యువతులపై ఓ ఉన్మాది దాడి చేశాడు. తేజస్విని రెడ్డి, అఖిల అనే ఇద్దరు తెలుగు యువతులు లండన్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నారు. ఎంఎస్‌ కోసం రెండున్నరేళ్ల క్రితం తేజస్విని లండన్ వెళ్లింది. అక్కడే ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ గ్రీన్‌ విచ్‌లో చదువుకుంటోంది. ఇద్దరు తెలుగు యువతులు ఉంటోన్న అపార్ట్‌మెంట్‌లోనే బ్రెజిల్‌కు చెందిన యువకుడు ఉంటున్నాడు.

లండన్ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటలకు తేజస్విని, అఖిలపై బ్రెజిల్‌కు చెందిన యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తేజస్విని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో యువతి అఖిల తీవ్రగాయాలపాలైంది. దీంతో ఆమెను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. తేజస్విని హైదరాబాద్‌లోని చంపాపేట వాసి. ఆమె తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. మృతురాలు మూడు నెలల క్రితమే హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. కానీ తాను ఆగస్టులో ఇండియాకు వస్తానని చెప్పడంతో తల్లిదండ్రులు కూడా సరే అన్నారు. ఆమె తిరిగి వచ్చాక పెళ్లి జరిపించేందుకు సంబంధాలు కూడా చూశారు. ఇంతలోనే తేజస్విని చనిపోవడంతో ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. బ్రెజిల్‌ యువకుడు చేసిన దాడిలో తీవ్ర గాయాలపాలైన మరో యువతి అఖిల జనగామ జిల్లా ఆలేరు వాసిగా తెలుస్తోంది. ఇద్దరు యువతులపై సదురు యువకుడు ఎందుకు దాడి చేశాడనే దానిపై లండన్ పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.

Next Story