'మంచి దొంగ'.. ఇంట్లో చోరీ చేసి నెలలో తిరిగిస్తానంటూ లెటర్
కొందరు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
By Srikanth Gundamalla Published on 4 July 2024 1:51 AM GMT'మంచి దొంగ'.. ఇంట్లో చోరీ చేసి నెలలో తిరిగిస్తానంటూ లెటర్
కొందరు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. మరింకొందరు అవసరాలను తీర్చుకునేందుకు చోరీలు చేస్తుంటారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేస్తారు. తాజాగా తమిళనాడులో కూడా ఇంట్లో ఇంట్లో దొంగ చోరీకి పాల్పడ్డాడు. అయితే.. అతను మంచి దొంగలాగా ఉన్నాడు. ఇంట్లో ఒక లెటర్ కూడా వదిలిపెట్టి వెళ్లాడు. క్షమించండి.. మరో నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
పోలీసుల వివరాల మేరకు... తూత్తుక్కుడి జిల్లాలోని తిరుచ్చెందూర్ వద్ద మేఘ్నాపురానికి చెందిన చిత్తిరై సెల్విన్ రిటైర్డ్ ఉపాధ్యాయుడు. ఈయనకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహమై వేరే ఊళ్లలో ఉంటున్నారు. అయితే.. జూన్ 17న భార్యతో కలిసి చెన్నై వెళ్లాడు సెల్విన్. వీరు లేని సమయంలో ఇంటిని సెల్వి అని మహిళ చూసుకునేది. ఈ నెల 1వ తేదీన ఆమె ఇంటిని శుభ్రం చేయడానికి వచ్చింది. ఇంటిని చూసి షాక్ అయ్యింది. ఎవరో దుండగులు ఇంటి తాళం పగలగొట్టారని గుర్తించింది. వెంటనే యజమానికి సమాచారం ఇచ్చింది.
దాంతో రిటైర్ట్ ఉపాధ్యాయుడు తన ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఏఏ వస్తువులు చోరీకి గురయ్యాయనే విషయాన్ని గమనించాడు. బీరువాలో రూ.60వేల నగదు. ఒకటిన్నర సవర్ల బంగారు కమ్మలు, వెండి గొలుసులు చోరీకి గురైనట్లు గుర్తించాడు. ఇంటి యజమాని పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించగా దొంగ రాసిన ఉత్తరం కనిపించింది. అందులో.. ‘నన్ను క్షమించండి. నేను నెలలో తిరిగిస్తాను. ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు, అందుకే దొంగతనం చేశా’నని రాసి ఉంది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి నిజంగానే మంచి దొంగ.. లేఖలో రాసిన ప్రకారం తిరిగి ఇచ్చేస్తాడా? లేదా? అనేది నెల రోజులకు తెలుస్తుంది.