'నీట్'లో ర్యాంక్ రాలేదని విద్యార్థి సూసైడ్.. బాధతో తండ్రి కూడా..
ఓ విద్యార్థి నీట్ ఎగ్జామ్ రెండు సార్లు రాశాడు. కానీ ర్యాంకు రాలేదు. దాంతో తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 14 Aug 2023 6:19 PM IST'నీట్'లో ర్యాంక్ రాలేదని విద్యార్థి సూసైడ్.. బాధతో తండ్రి కూడా..
విద్యార్థులు పరీక్షలు రాశాక అనుకున్న ర్యాంక్ రాకపోతే చాలా బాధపడతారు. కొందరు నెక్ట్స్ టైమ్ చూసుకుందాం అనుకుంటే.. ఇంకొందరు లైఫ్ అండ్ డెత్‌గా భావించి జీవితాలకే ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. తమిళనాడులో ఓ విద్యార్థి నీట్ ఎగ్జామ్ రెండు సార్లు రాశాడు. కానీ ర్యాంకు రాలేదు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నకడుకు కళ్లముందే శవమై పడి ఉండటంతో తట్టుకోలేకపోయిన తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తమిళనాడులోని చెన్నైకి చెందిన జగదీశ్వరన్ 2022లో ఇంటర్ పూర్తి చేశాడు. వైద్య కోర్సులో చేరాలని ఎన్నో కలలు కన్నాడు. అలాగే కష్టపడ్డాడు కూడా. వైద్య కోర్సు కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు రాశాడు. దానికి ముందు శిక్షణ కూడా తీసుకున్నాడు. మొదటిసారి రాస్తే మంచి ర్యాంకు రాలేదు. దాంతో సీటు లభించలేదు. రెండోసారి కూడా పట్టువదలకుండా ప్రయత్నించాడు. కానీ మళ్లీ నిరాశే ఎదురైంది. దాంతో జగదీశ్వరన్ తీవ్ర మనస్థాపం చెందాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12న చెన్నైలోని క్రోమెపేట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి గమనించి ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే జగదీశ్వరన్ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.
బరువెక్కిన గుండెతో కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు తండ్రి సెల్వ శేఖర్. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఆ తర్వాత కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి కూడా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు మృతికి నీట్ కారణమని ఆరోపించాడు. కాగా.. జగదీశ్వరన్ మృతి తర్వాత అతడు సూసైడ్ నోట్ రాసినట్లు తమకు ఎలాంటి లేఖ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా.. ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. విద్యార్థులు తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకెళ్లాలి కానీ.. ఇలా కుటుంబ సభ్యలను బాధపెట్టే నిర్ణయాలు వద్దని కోరారు. జగదీశ్వరన్, సెల్వశేఖర్ మృతిపట్ల సీఎం స్టాలిన్ సంతాపం తెలిపారు.