ట్యూషన్‌లో మందలించిన టీచర్‌ను కత్తితో పొడిచిన బాలుడు

ఓ విద్యార్థి ట్యూషన్‌లో టీచర్‌ మందలించాడని కక్ష పెంచుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on  13 Aug 2023 7:48 PM IST
Student, Chapped, Tuition Teacher, mumbai,

ట్యూషన్‌లో మందలించిన టీచర్‌ను కత్తితో పొడిచిన బాలుడు  

స్కూళ్లో పిల్లలు బాగా చదువుకోకపోతే.. ఇంట్లో ఉన్న పేరెంట్స్‌ వారిని ట్యూషన్‌కు పంపిస్తారు. కొందరు విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల్లో వీక్‌గా ఉంటారు.. అలాంటి వారిని కూడా ట్యూషన్‌కు పంపితే చురుగ్గా అవుతారని ప్రత్యేక ట్యూషన్లు పెట్టిస్తారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్థి ట్యూషన్‌లో టీచర్‌ మందలించాడని కక్ష పెంచుకున్నాడు. బయట కనిపించిన ఆయన్ని.. కత్తితో వెనుక నుంచి వెళ్లి పొడిచాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది.

మహారాష్ట్రలోని ముంబైలో ఈనెల 10న జరిగింది ఈ సంఘటన. రాజు ఠాకూర్ అనే 26 ఏళ్ల యువకుడు ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ట్యూషన్‌లో ఓ బాలుడు చదువు గురించి ధ్యాస లేకుండా ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. పైగా బాలికలతో సన్నిహితంగా మెలగసాగాడు. ఇలా ఐతే బాగోదని ట్యూషన్ నిర్వాహకుడు రాజు ఆ బాలుడిని అక్కడి నుంచి పంపేశాడు. ట్యూషన్‌కు రావొద్దని చెప్పాడు. అదే మనసులో పెట్టుకున్న బాలుడు.. ట్యూషన్ టీచర్‌పై కక్ష పెంచుకున్నాడు. ఒక రోజు మార్కెట్‌ దగ్గర నిలబడి ఉన్న రాజుని చూశాడు. వెంటనే ఆ బాలుడు కత్తి తీసుకుని రాజు వెనకాల వైపు వెళ్లి కత్తితో పొడిచాడు. ఆ తర్వాత ముందు నుంచి మరోసారి పొడిచాడు. అక్కడే ఉన్న కొందరు బాలుడిని ఆపే ప్రయత్నం చేసినా కుదరలేదు. కత్తితో పొడిచిన తర్వాత రాజు కింద పడిపోయాడు.

ఆ తర్వాత బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రగాయాల పాలైన రాజుని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ట్యూషన్ టీచర్ రాజు పరిస్థితి విషమంగానే ఉందని చెబుతున్నారు వైద్యులు. కాగా.. రాజుని పొడిచిన వెంటనే అక్కడి నుంచి బాలుడు పారిపోయాడు. ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. రాజుని బాలుడు కత్తితో పొడిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Next Story