కొబ్బరి బోండాల చాటున ఎర్రచందనం స్మగ్లింగ్
కొబ్బరి బోండాల మాటున ఎర్రచందనం తరలించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యారు.
By Srikanth Gundamalla Published on 28 Dec 2023 5:18 PM ISTకొబ్బరి బోండాల చాటున ఎర్రచందనం స్మగ్లింగ్
ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఎంత అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసినా అక్రమదారులు కొత్త కొత్త ప్లాన్లు వేసి చెక్‌పోస్టులు దాటించాలని చూస్తున్నారు. పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఆసరగా తీసుకుని చాలా మంది వివిధ రకాలుగా తరలించే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. తాజాగా కొబ్బరి బోండాల మాటున ఎర్రచందనం తరలించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌వోటీ బృందానికి కొందరు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా సమాచారం అందింది. దాంతో.. ప్రతి వాహనాన్ని ఆపి తనఖీలు ప్రారంభించారు. ఈక్రమంలోనే ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ డీసీఎం వ్యాన్‌ను కూడా ఆపారు. ముందుగా అందులో కొబ్బరి బోండాలను తరలిస్తున్నట్లు చెప్పారు. పైన పైన పోలీసులకు కూడా కొబ్బరి బోండాలే కనిపించాయి. ఎందుకో అనుమానం వచ్చిన పోలీసులు కొబ్బరి బోండాలను కొన్నింటిని తొలగించి చూశారు. దాంతో.. నిందితుల వ్యవహారం బయటపడింది.
ఎస్‌వోటీ బృందం కొబ్బరి బోండాల చాటు దాచిన 101 ఎర్రచందనం దుంగలను బయటకు తీశారు. ముగ్గురు సభ్యుల అంతర్‌రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. అయితే పట్టుబడ్డ ఎర్రచందనం దుంగల విలువ రూ.కోటిన్నర ఉంటుందని పోలీసులు చెప్పారు. ముగ్గురు నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నుంచి ఎర్రచందనం దుంగలు తీసుకుని హైదరాబాద్ మీదుగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నట్లుగా పోలీసుల విచారణ తేలింది. ఎస్‌వోటీ బృందం తదుపరి విచారణ నిమిత్తం అరెస్ట్ చేసిన ముగ్గురితో పాటు ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ స్మగ్లింగ్‌పై కేసు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.