తమిళనాడులోని తిరువణ్ణామలైలో 16 సంవత్సరాల పాఠశాల విద్యార్థిని గర్భవతి అని తెలియడంతో.. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. వీరందరినీ పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో స్కూల్ ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్, మరొకరు ఉన్నారు.
సదరు విద్యార్థిని తిరువణ్ణామలైలోని ఒక పాఠశాలలో చదువుకుంది. కొద్ది రోజుల క్రితం చెంగల్‌పేట జిల్లాలోని తన గ్రామానికి వచ్చింది. ఇంటికి చేరుకున్న విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు బాలికను ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షలు చేయగా బాలిక 6 నెలల గర్భిణి అని తేలింది. అనంతరం బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ కొద్దిరోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం విద్యార్థిని ఆస్పత్రిలో మృతి చెందింది.
పోలీసులు విచారణ ప్రారంభించగా విద్యార్థిని చదువుతున్న పాఠశాలలో సమీపంలో హరిప్రసాద్ అనే వ్యక్తి నివాసముంటున్నట్లు తెలిసింది. బాలిక హరిప్రసాద్ కారణంగా గర్భం దాల్చినట్లు పోలీసులకు తెలిసింది. పోక్సో చట్టం కింద హరిప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు స్కూల్ ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్ కూడా అదుపులోకి తీసుకున్నారు. వారికి ఈ విషయం ముందే తెలిసిందని పోలీసులు చెప్పారు. బాలల సంరక్షణ శాఖ అధికారికి తెలియజేయకుండా ఉన్నారని పోలీసులు తెలిపారు.