ఇంటికి ఆలస్యంగా వచ్చిందని తల్లి మందలిస్తే కూతురు సూసైడ్
ఇంటికి ఆలస్యంగా వచ్చిందని కూతురిని తల్లి మందలించింది. దాంతో.. మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 9 Oct 2023 6:40 AM ISTఇంటికి ఆలస్యంగా వచ్చిందని తల్లి మందలిస్తే కూతురు సూసైడ్
ఈ మధ్య కాలంలో యువత చిన్న విషయాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు చదువుల్లో కాస్త తక్కువ మార్కులు వచ్చాయని.. ఇంకొందరు తల్లిదండ్రులు తిట్టారనే కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులకు గుండెకోతను మిగులుస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇంటికి ఆలస్యంగా వచ్చిందని కూతురిని తల్లి మందలించింది. దాంతో.. మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ కుంటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.
ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం రామునిపట్లలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రామునిపట్లకు చెందిన కళ్లెం సుజాత, మల్లేశం దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. రెండో కుమార్తె అమల (19) బీఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 2వ తేదీన ఆమెకు కడుపునొప్పి రావడంతో మందలు కోసం గ్రామంలోని ఆర్‌ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లి వచ్చింది. అయితే.. డాక్టర్ వద్దకు వెళ్లిన యువతి ఇంటికి ఆలస్యంగా వచ్చింది. దాంతో.. తల్లి కూతురిని ఇంటికి ఇంత ఆలస్యంగా వస్తావా అంటూ మందలించింది. దాంతో.. మనస్తాపం చెందింది యువతి. ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకుని పురుగుల మందు తాగింది.
అయితే.. కూతురు పురుగుల మందు తాగిన విషయాన్ని తల్లి కాసేపటికే గమనించింది. దాంతో.. అమలను వాహనంలో సిద్దిపేటలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లే సరికి పరిస్థితి విషమించింది. దాంతో..వైద్యులు ఆమెను వెంటనే హైదరాబాద్‌లో మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులు వెంటనే ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న అమల ఆదివారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. ఆమె మేనమామ రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.