వీళ్లెక్కడి దొంగలు బాసూ..ఏకంగా బస్‌ షెల్టర్‌ను ఎత్తుకెళ్లారు..!

బెంగళూరులో కొందరు దొంగలు ఏకంగా బస్‌ షెల్టర్‌నే ఎత్తుకెళ్లారు.

By Srikanth Gundamalla  Published on  5 Oct 2023 4:47 PM IST
Rs.10 lakh,  Bus Shelter, Theft,  Bangalore,

 వీళ్లెక్కడి దొంగలు బాసూ..ఏకంగా బస్‌ షెల్టర్‌ను ఎత్తుకెళ్లారు..!

బస్ స్టాపుల వద్ద జేబు దొంగలు ఉంటారు.. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక బోర్డులను పెట్టి ఉంచడం చూశాం. అలాగే పిల్లలను ఎత్తుకెళ్లేవారు, బ్యాగులను అపహరించేవారినీ చూసి ఉంటాం. అంతేకాదు.. బైకులు పెడితే తమవే అన్నట్లు అక్కడినుంచి తీసుకెళ్తారు కొందరు దొంగలు. అయితే..బెంగళూరులో కొందరు దొంగలు ఏకంగా బస్‌ షెల్టర్‌నే ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనం గురించి తెలుసుకున్న వారంతా షాక్‌ అవుతున్నారు. అలా బస్టాప్‌ను ఎలా ఎత్తుకెళ్లారంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ చోరీకి సంబందించిన వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

బెంగళూరులోని కన్నింగ్‌ హామ్‌రోడ్‌లుఓ బస్‌ షెల్టర్‌ను వారం రోజుల క్రితమే బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్ వారు నిర్మించారు. దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేసి ప్రయాణికుల కోసం బస్‌ షెల్టర్‌ను ఏర్పాటు చేశారు. కానీ.. అదిఏర్పాటు చేసి పది రోజులు కూడా గడవకముందే అధికారులకు షాకిచ్చారు దొంగలు. సరిగ్గా వారం రోజుల తర్వాత బస్‌స్టాప్‌ ఉందనే ఆనవాళ్లు లేకుండా చేశారు. అయితే.. బస్‌ షెల్టర్‌ను అధికారులు దిట్టంగా స్టెయిన్‌లెస్‌-స్టీల్‌తో ఏర్పాటు చేశారు. దాన్ని ఎలాగైనా దోచుకోవాలని దాన్ని.. స్టీల్ కాబట్టి అమ్ముకుంటే మంచిగా సొమ్ముచేసుకోవచ్చని దొంగలు భావించినట్లు ఉన్నారు. అంతే ఎవరూ లేని సమయంలో చోరీ చేసి తీసుకెళ్లారు. అయితే.. ఈ సంఘటనపై బస్‌స్టాప్‌ను నిర్మించిన కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. తాము కాఫీ డేకి దగ్గరలో బస్‌స్టాప్ నిర్మించామని చెప్పారు. తాము బస్‌స్టాప్‌ను ఏర్పాటు చేసిన వారంలోపే మాయం అయ్యిందని అన్నారు.

అయితే.. బస్‌ షెల్టర్‌ను ఉద్దేశపూర్వకంగానే తీసేశారా అని బీబీఎంపీ అధికారులను అడిగామని చెప్పారు. కానీ వారు తీయలేదని చెప్పడంతో షాక్‌ అయ్యామని అన్నారు. ఆ తర్వాత బస్ షెల్టర్‌ మాయం అయ్యిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. బస్సు షెల్టర్‌ లేకపోవడంతో ప్రజలు కాస్త ఇబ్బందులు పడుతున్నారని.. ఎండ, వాన వస్తే తడిసే పరిస్థితులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాగా.. బస్‌ షెల్టర్‌ను ఎత్తుకెళ్లిన దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Next Story