విజయనగరంలో దారుణం.. 6 నెలల చిన్నారిపై అత్యాచారం
మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla
విజయనగరంలో దారుణం.. 6 నెలల చిన్నారిపై అత్యాచారం
మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కొందరు కామాంధులు చిన్నారులు అని కూడా చూడకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఆరు నెలల చిన్నారిపై వరుసకు తాత అయిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి ఊయలలో ఉండగానే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రామభద్రాపురం మండలంలో శనివారం ఈఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారిని తల్లి ఊయలలో వేసి గ్రామంలో ఉన్న కిరాణ దుకాణంలో సరకులు తేవడానికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నార్లవలస గ్రామానికి చెందిన ఎరకన్న దొర అక్కడికి వచ్చాడు. చిన్నారిపై అత్యాచారం చేశాడు. దాంతో.. ఆ చిన్నారి గట్టిగా ఏడ్చింది. ఏడుపు విన్న చిన్నారి అక్క అక్కడికి వచ్చింది.తల్లికి సమాచారం అందించింది. తల్లితో పాటు గ్రామస్తులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ.. ఆ వ్యక్తి ఎవరికీ చిక్కకుండా అక్కడి నుంచి పరారయ్యాడు.
చిన్నారిని తల్లిదండ్రులు, బంధువులు బాడంగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విజయగనరంలోని ఘోష ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స తర్వాత చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందితుడి కోసం గాలించి.. చివరకు నార్లవలస దగ్గరే అరెస్ట్ చేశారు.