బాలికపై అత్యాచారం.. నిందితుడి ఇంటిని తగలబెట్టిన జనం

అమ్మాయిలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  29 Sept 2024 3:13 PM IST
బాలికపై అత్యాచారం.. నిందితుడి ఇంటిని తగలబెట్టిన జనం

అమ్మాయిలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా కొందరు కామాంధులు వ్యవహరిస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేటలో ఓ యువకుడు చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. అతన్ని చితకబాదేందుకు అతని ఇంటికి వెళ్లారు. కానీ.. అక్కడతను లేకపోవడంతో ఇంటికి నిప్పు పెట్టేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువన్నపేటలో స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలికపై గ్రామానికే చెందిన ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో తీవ్ర ఆగ్రహంతో స్థానికులను తీసుకుని నిందితుడి ఇంటికి వెళ్లారు. త్యాచారం విషయం తెలిసి గ్రామస్థులంతా అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసి నిందితుడు పరారయ్యాడు. ఇక దీని గురించి తెలుసుకున్న పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ.. నిందితుడు కనిపించకపోడంతో గ్రామస్తులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతని ఇంటికి నిప్పు పెట్టారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇంటి ముందు నిలిపిన వాహనాలపై మహిళలు దాడి చేశారు. అద్దాలు పగలగొట్టారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి గ్రామస్తులను చెదరగొట్టారు. చివరకు బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

Next Story