అత్యాచారం చేసేందకు వ్యక్తి యత్నం.. దారుణంగా కొట్టి చంపిన మహిళ
శ్రీనివాస్ అనే వ్యక్తి తప్పతాగి రోడ్లపైకి వచ్చాడు. తాగిన మత్తులో జయమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లాడు..
By Srikanth Gundamalla Published on 23 Jun 2023 6:08 PM ISTఅత్యాచారం చేసేందకు వ్యక్తి యత్నం.. దారుణంగా కొట్టి చంపిన మహిళ
రోజూ దేశంలో ఏదో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. చిన్నపిల్లలు.. యువతులు ఇలా వావివరసలు చూడకుండా కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు. కొన్నిసార్లైతే మహిళలు ప్రాణాలు కూడా కోల్పోయారు. నిర్భయ ఘటన తర్వాత కొత్త చట్టాలు వచ్చినా దారుణాలు ఆగడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి మహిళపై అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. దీంతో.. ఎదురు తిరిగిన సదురు మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. చితక్కొట్టింది. ఆమె దాడిలో సదురు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.
రంగారెడ్డి జిల్లా బద్వేల్‌లో జరిగింది ఈ ఘటన. తెల్లవారుజామునే శ్రీనివాస్ అనే వ్యక్తి తప్పతాగి రోడ్లపైకి వచ్చాడు. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. చీకటిగానే ఉంది. అయితే.. తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా.. జయమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లాడు. డోర్ కొట్టాడు. ఆమె డోర్ తెరిచింది. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్‌ను చూసి భయపడింది. డోర్ క్లోజ్ చేసే ప్రయత్నం చేసింది. కానీ శ్రీనివాస్ ఇంట్లోకి బలవంతంగా వెళ్లాడు. జయమ్మపై బలత్కారం చేయబోయాడు. దీంతో ఆ మహిళ ఎలాగోలా ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. కానీ.. శ్రీనివాస్ ఆమెను వదల్లేదు. దీంతో తనని తాను కాపాడేందుకునేందుకు శ్రీనివాస్‌పై ఎదురుదాడి చేసింది సదురు మహిళ. పక్కనే ఉన్న రాడ్డుని తీసుకుని దారుణంగా కొట్టింది. ఆ దెబ్బలకు శ్రీనివాస్ లేవలేకపోయాడు. ఆ వెంటనే అక్కడి నుంచి జయమ్మ వెళ్లిపోయింది. కాగా.. జయమ్మ కొట్టిన దెబ్బలకు శ్రీనివాస్ తీవ్రగాయాల పాలయ్యాడు. రక్తస్రావమై ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన తర్వాత భర్త బాలయ్యతో కలిసి జయమ్మ రాజేంద్రనగర్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.