రాజేంద్రనగర్‌లో కీచక టీచర్..ఎనిమిదో తరగతి విద్యార్థినిపై వేధింపులు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో అమానుష సంఘటన చోటు చేసుకుంది. స్కూల్ విద్యార్థిని పట్ల టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడు.
By Srikanth Gundamalla Published on 5 Aug 2023 1:45 PM ISTరాజేంద్రనగర్‌లో కీచక టీచర్..ఎనిమిదో తరగతి విద్యార్థినిపై వేధింపులు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో అమానుష సంఘటన చోటు చేసుకుంది. బుద్ధి నేర్పాల్సిన టీచరే అడ్డదారులు తొక్కాడు. అభంశుభం తెలియని స్కూల్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. టీచర్ వేధింపులను తట్టుకోలేక చివరకు తల్లిదండ్రులకు చెప్పింది బాధితురాలు. దాంతో.. స్కూల్‌కు చేరుకున్న తల్లిదండ్రులు ఆందోళన చేశారు. స్కూల్ ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ విద్యార్థిని అత్తాపూర్‌లోని ఓ ప్రయివేట్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నది. అయితే అదే స్కూల్లో విష్ణు అనే వ్యక్తి పీఈటీ టీచర్‌గా పని చేస్తున్నాడు. ప్రతిరోజు పాఠశాలలో సదరు విద్యార్థిని పట్ల విష్ణు అసభ్యంగా ప్రవర్తించ డమే కాకుండా దురుసుగా ప్రవర్తించేవాడు. ఆ విద్యార్థినికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురి చేశాడు. ఆ విధంగా పీఈటీ టీచర్ వేధింపులను తాళలేక విద్యార్థిని ఎంతో మదనపడింది. ఇంట్లో చెప్తే ఏమంటారో అని భయపడింది. అంతేకాక టీచర్ ఆకవడంతో మరింత వణికిపోయింది.
ఎన్నిరోజులకూ పీఈటీ టీచర్‌లో మార్పు రాలేదు. పైగా వేధింపులు ఎక్కువయ్యాయి. దాంతో.. విద్యార్థిని తాళలేక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దాంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ వద్దకు చేరుకున్నారు. పీఈటీ టీచర్ విష్ణు నిర్వాకాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఇక టీచర్‌పై వచ్చిన ఫిర్యాదును యాజమాన్యం సీరియస్‌గా తీసుకోలేదు. పైగా బాధితురాలి తల్లిదండ్రుల ముందే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఆగ్రహానికి గురైన బాధితురాలి బంధువులు, తల్లిదండ్రులు స్కూల్‌లోనే ఆందోళన చేశారు. ఆ తర్వాత అక్కడున్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకోవడంతో భయపడిపోయిన స్కూల్ యాజమాన్యం.. పోలీసులకు కాల్ చేసింది. వెంటనే సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు బాలిక తల్లిదండ్రులు, బంధువులను శాంతపరిచారు. తల్లిదండ్రులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపారు. ఇక బాధితురాలి ఫ్యామిలీ నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. పీఈటీ టీచర్ విష్ణుని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.