పవిత్ర గ్రంథంలో పేజీలు చింపాడని.. యువకుడిని కొట్టి చంపిన స్థానికులు

పంజాబ్‌లోని గురుద్వారాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  5 May 2024 9:21 AM IST
punjab, man, beaten,  death, gurudwara,

పవిత్ర గ్రంథంలో పేజీలు చింపాడని.. యువకుడిని కొట్టి చంపిన స్థానికులు

పంజాబ్‌లోని గురుద్వారాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. గురుద్వారాలో పూజనీయమైన గురు గ్రంథ్‌ సాహిబ్‌ పేజీలను చింపేశాడనీ.. ఓ 19 ఏళ్ల యువకుడిని పట్టుకుని స్థానిక ప్రజలు శనివారం సాయత్రం తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన బండల గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బక్షిష్‌ సింగ్‌ అనే యువకుడు గురుద్వారా ప్రాంగణంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత పవిత్ర గ్రంథంలోని కొన్ని పేజీలను చింపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. యువకుడు పవిత్ర గ్రంథంలోని పేజీలు చింపేసి పారిపోతున్న విషయం తెలుసుకున్న స్థానికులు అతన్ని అడ్డగించారు. అందరూ కోపంతో ఊగిపోతూ.. స్థానిక ప్రజలు సదురు యువకుడిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. దాంతో బక్షిస్‌ సింగ్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.యువకుడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పడికే చనిపోయాడని వెల్లడించారు. కాగా.. అంతకుముందు సీనియర్ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సౌమ్య మిశ్రా సహా.. ఇతర ఉన్నతాధికారులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. బక్షిష్‌ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని అతని తండ్రి తెలిపాడు. దాని నుంచి కోలుకునేందుకు చికిత్స అందిస్తున్నామని ఆయన వెల్లడించాడు. తన కుమారుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలిన బక్షిష్‌ సింగ్‌ తండ్రి ఈ సందర్భంగా కోరారు.

Next Story