భార్యను చంపి హార్ట్‌ ఎటాక్‌గా చెప్పిన రాజకీయ నేత కొడుకు, అరెస్ట్

పెళ్లయిన ఏడాదికే భార్యను చంపాడు భర్త. నిందితుడు నల్లగొండ జిల్లాకు చెందని ఓ రాజకీయ నాయకుడు కుమారుడు.

By Srikanth Gundamalla  Published on  29 July 2023 1:45 PM IST
Political leader Son, Vallabh, Murder,  Wife,

 భార్యను చంపి హార్ట్‌ ఎటాక్‌గా చెప్పిన రాజకీయ నేత కొడుకు, అరెస్ట్

పెళ్లయిన ఏడాదికే భార్యను చంపాడు భర్త. నిందితుడు నల్లగొండ జిల్లాకు చెందని ఓ రాజకీయ నాయకుడు కుమారుడు. అయితే.. భార్యను కొట్టి చంపిన తర్వాత ఆమె హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. రాజకీయ పలుకుబడితో హత్యను సమజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే.. చివరకు పోస్టుమార్టం రిపోర్టులో నిజాలు బయటపడ్డాయి. మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయని.. ఆ గాయాలతోనే చనిపోయినట్లు తేలింది. దాంతో.. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నల్లగొండ జిల్లా నారాయణగూడ ఎస్‌హెచ్‌వో శ్రీనివాసు తెలిపిన వివరాల ప్రకారం.. రాజకీయ నేత రంగసాయిరెడ్డి కుమారుడు వల్లబ్‌రెడ్డి. ఏడాది కిందట లహరితో వల్లభ్‌ వివాహం జరిగింది. అయితే.. కొంత కాలంగా దంపతుల మధ్య మనస్పర్ధలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. జూలై 13వ తేదీన లహరిని వల్లభ్‌రెడ్డి తీవ్రంగా కొట్టాడని.. లహరి తలను గోడకు, తలుపునకేసి బాదాడని పోలీసులు చెప్పారు. అంతేకాక లహరి పొట్టలో కాలుతో తన్నాడని వైద్యులు చెప్పిన నివేదిక ద్వారా తెలిసిందని ఎస్‌హెచ్‌వో శ్రీనివాసు చెప్పారు. దాంతో.. లహరి పొట్టలో రెండు లీటర్ల బ్లడ్‌ బ్లీడింగ్‌ అయ్యింది. స్పృహ తప్పి పడిపోయి ప్రాణాలు కోల్పోయిందని ఎస్‌హెచ్‌వో శ్రీనివాసు చెప్పారు.

భార్య చనిపోయిన విషయం గ్రహించిన వల్లభ్‌.. హత్య కేసు తనపైకి వస్తుందని ఎలాగైనా తప్పించుకోవాలనుకున్నాడు. దాంతో.. లహరి సహజంగా మరణించిందని నిరూపించే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా హార్ట్‌ ఎటాక్‌ పేరుతో లహరిని ఆస్పత్రిలో జాయిన్ చేశాడని పోలీసులు చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు కారణంగానే చనిపోయినట్లుగా బంధువులందరినీ నమ్మించాడు. ఇక 24వ తేదీన నిర్వహించిన దినకర్మకు కూడా 10వేల మందికి భోజనాలు పెట్టి ఏమీ తెలియనట్లు యాక్ట్‌ చేశాడు. ఆ తర్వాతే లహరి పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. వల్లభ్‌ వ్యవహారం బయటపడింది. వల్లభ్‌ తీవ్రంగా కొట్టడంతోనే లహరి చనిపోయిందని తేలిందని పోలీసులు చెప్పారు. లహరి తలపై కూడా గాయాలు ఉన్నట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ లహరి తల్లిదండ్రులను వల్లభ్‌ బెదిరించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చివరకు వల్లభ్‌పై సెక్షన్‌ 302 మర్డర్, 201 సాక్ష్యాల తారుమారు నేరాల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం నిందితుడు వల్లభ్‌ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు.

Next Story