జూ.ఎన్టీఆర్ ఫ్యాన్ మృతిపై అనుమానాలు..జస్టిస్‌ కోసం సోషల్‌మీడియాలో ఫైట్

ఉరివేసుకుని శ్యామ్‌ మృతిచెందగా.. అతని శరీరంపై గాయాలు కనిపించాయి. అంతేకాక శరీరం పూర్తిగా నేలపై తాకి ఉంది.

By Srikanth Gundamalla  Published on  27 Jun 2023 5:23 AM GMT
NTR, Shyam, Fan, Social Media, Justice

జూ.ఎన్టీఆర్ ఫ్యాన్ మృతిపై అనుమానాలు..జస్టిస్‌ కోసం సోషల్‌మీడియాలో ఫైట్

ఇటీవల జూనియర్‌ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్‌ మరణించాడు. శ్యామ్‌ మృతి ఘటనకు ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకొంటున్నది. శ్యామ్‌ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని చింతలూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఉరివేసుకుని శ్యామ్‌ మృతిచెందగా.. అతని శరీరంపై గాయాలు కనిపించాయి. అంతేకాక శరీరం పూర్తిగా నేలపై తాకి ఉంది. దీంతో.. శ్యామ్‌ది ఆత్మహత్య కాదని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత నారా లోకేశ్‌ కూడా శ్యామ్‌ ఆత్యహత్యపై ట్వీట్‌ చేశాడు. దీంతో.. శ్యామ్ మరణ సంఘటన ఏపీ పాలిటిక్స్‌లోనూ హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు ఇతర హీరోల అభిమానులు అంతా ఏకమై శ్యామ్‌కు న్యాయం జరగాలంటూ కోరుతున్నారు. #WeWantJusticeForShyamNTR పేరుతో ట్విట్టర్‌ ట్రెండ్‌ చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎన్టీఆర్ అభిమాని శ్యామ్‌ కాలేజ్‌ స్టూడెంట్. స్వస్థలం కొప్పిగుంట గ్రామం. శ్యామ్‌ చనిపోయింది చింతలూరు గ్రామంలో. గతంలో విశ్వక్సేస్‌ సినిమా దాస్‌కా దమ్కీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్‌ గెస్ట్‌గా వెళ్లారు. అప్పుడు శ్యామ్‌ ఎన్టీఆర్‌తో ఫొటో దిగేందుకు ప్రయత్నించాడు. బాడీగార్డులు నెట్టేసినా ముందుకు వెళ్లాడు.. దాంతో ఎన్టీఆరే స్వయంగా పిలిచి దిగాడు శ్యామ్‌. అప్పుడు ఆ వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. ప్రస్తుతం శ్యామ్‌ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

శ్యామ మరణం హత్యనా..? ఆత్మహత్యనా..? హత్య అయితే ఎవరు చేసి ఉంటారు..? ఎందుకు చేసి ఉంటారు..? ఇలా ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. శ్యామ్‌ మరణంపై అందరు హీరోల అభిమానులు ఏకం అవుతున్నారు. న్యాయం జరగాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. వాస్తవాలు వెలుగులోకి రావాలని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్‌మీడియాలో జస్టిస్ ఫర్ శ్యామ్‌ అంటూ ట్వీట్స్.. మీమ్స్‌ పెడుతున్నారు.

శ్యామ్‌ మరణంపై టీడీపీ నేత నారా లోకేశ్‌ కూడా స్పందించారు. శ్యామ్ అనుమానాస్పద మరణం అత్యంత బాధించిందని అన్నారు. శ్యామ్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులకు లోకేశ్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఎలాంటి రాజకీయ ప్రభావం చూపకుండా శ్యామ్‌ డెత్‌ మిస్టరీ కేసును విచారించాలని ఆయన పోలీసులను కోరారు. ఈ సంఘటనలో వైసీపీ లీడర్లకు సంబంధం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారని.. ఆ క్రమంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలన్నారు. శ్యామ్‌కు న్యాయం జరిగేంత వరకు తానూ పోరాటం చేస్తానని ట్విట్టర్‌లో పోస్టు పెట్టి రాసుకొచ్చారు టీడీపీ నేత నారా లోకేశ్. వైసీపీ నేతలను ప్రస్తావిస్తూ లోకేశ్‌ చేసిన ట్వీట్‌ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. శ్యామ్‌ మరణంపై లోకేశ్ స్పందించినందుకు ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు థాంక్యూ చెబుతున్నారు. శ్యామ్‌కు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం అంటూ రిప్లైలు ఇస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ కూడా సోషల్‌ మీడియాలో ఈ ఘటనపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఏపీ పోలీసులు నిజాయితీగా విచారణ జరపాలని.. దోషులను శిక్షించాలని కోరుతున్నారు. నిజానిజాలను నిష్పక్షపాతంగా బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. శ్యామ్ కుటుంబానికి న్యాయం జరగాలని పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్‌ గ్రూప్‌ ట్వీట్‌ చేసింది.

Next Story