Nizamabad: విషాదం.. కారులో ఆడుకునేందుకు ఎక్కి బాలుడు మృతి
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 8 April 2024 1:10 PM ISTNizamabad: విషాదం.. కారులో ఆడుకునేందుకు ఎక్కి బాలుడు మృతి
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో విషాదం చోటుచేసుకుంది. కారులో ఆడుకునేందుకు ఓ బాలుడు ఎక్కాడు. ఇక కాసేపటికే ఆ కారు డోర్లు లాక్ అయిపోయాయి. దాంతో.. బయటకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. పార్కింగ్‌లో ఉంచిన కారులో ఎక్కాడు బాలుడు. ఇక ఊపిరి ఆడక ఆ బాలుడు మృతిచెందాడు. స్థానికంగా ఈ సంఘటన విషాదాన్ని నింపింది.
గోసం బస్తీకి చెందిన రేణుక కుమారుడు రాఘవకు ఆరేళ్లు. తల్లితో కలిసి ఈ నెల 5న రాకసిపేటలోని హనుమాన్ గుడి ప్రాంగణంలో కూలీ పనులకు వెళ్లారు. ఈ క్రమంలో తల్లి కూలీ పనుల్లో తల్లి పనుల్లో నిమగ్నమై ఉండగా.. కుమారుడు రాఘవ ఆడుకుంటానని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. కొడుకు కనిపించకపోయే సరికి కంగారుపడిపోయారు. చుట్టుపక్కల బాగా వెతికారు. కానీ.. ఎంతకీ ఆచూకీ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రెండ్రోజుల తర్వాత మిస్ అయిన బాలుడు అదే ప్రాంతంలో ఉన్న పార్కింగ్‌లో ఉంచిన కారులో మృతిచెంది కనిపించాడు. కారు డోర్లు తెరుచుకుని ఉండగా బాలుడు అందులోకి వెళ్లాడనీ.. ఆ తర్వాత కారు డోర్లు లాక్ అయ్యాయని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఆ తర్వాత చిన్నారి కారులోనే ఊపిరాడక మృతి చెందాడని పోలీసులు అంటున్నారు. ఆదివారం రాత్రి కారు యజమాని కారు తీసేందుకు బయటకు రాగా.. మృతదేహాన్ని గుర్తించాడు. వెంటనే పోలీసులకు చెప్పడంతో చనిపోయిన బాలుడు మిస్సింగ్ అయిన రాఘవగా గుర్తించారు. ఇక మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇప్పటికే కారులో ఇరుక్కుని పలువురు చిన్నారులు మృతిచెందిన సంఘటనలు జరిగాయి. అందుకే చిన్నారులు ఆడుకునేందుకు వెళ్తున్న సమయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాహనాల వైపు వెళ్లకుండా ఉండేలా చూడటం అవసరమని అంటున్నారు.