తక్కువ జీతం..పిల్లల్ని పోషించలేక మిషన్ భగీరథ ఉద్యోగిని సూసైడ్
మిషన్ భగీరథ ఉద్యోగిని జీతం చాలడం లేదని.. దాంతో పిల్లల్ని పోషించడం కష్టంగా మారిందని సూసైడ్‌కు పాల్పడింది.
By Srikanth Gundamalla Published on 15 July 2023 4:36 AM GMTతక్కువ జీతం..పిల్లల్ని పోషించలేక మిషన్ భగీరథ ఉద్యోగిని సూసైడ్
ఎక్కువ మంది తక్కువ జీతంతోనే జీవితాన్ని సాగదీస్తున్నారు. ఎడాపెడా ఖర్చులు పెట్టకుండా అవసరాలను తగ్గించుకుని బతుకుబండి లాగుతుంటారు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలను తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనే నల్లగొండ జిల్లాలో జరిగిండి. మిషన్ భగీరథ ఉద్యోగిని జీతం చాలడం లేదని.. దాంతో పిల్లల్ని పోషించడం కష్టంగా మారిందని సూసైడ్‌కు పాల్పడింది.
నల్లగొండ జిల్లాలోని హాలియాలో చోటుచేసుకుంది ఈ విషాద సంఘటన. ఎస్‌ఐ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమల సాగర్ మండలం అల్వాల గ్రామానికి చెందిన సింగం పుష్పలత (26)కు మహేష్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. మహేష్ మిషన్ భగీరథ నీటిశద్ధి కేంద్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేసేవాడు. పెళ్లయిన కొంత కాలం తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు మహేష్. పైగా తక్కువ జీతం. చాలీచాలని శాలరీతో ఇల్లు గడవడం కూడా కష్టమైంది. దాంతో.. మహేష్ ఏడాది కిందట ఒక రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత భర్త ఉద్యోగాన్ని భార్య పుష్పలతకు ఇచ్చారు అధికారులు. వీరిద్దరికీ ఒక పాప, కుమారుడు కూడా ఉన్నారు.
భర్త ఉద్యోగం తనకు ఇచ్చాక పుష్పలత హాలియాలోని సాయిప్రతాప్‌నగర్ కాలనీలో ఒక గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటోంది. వచ్చే రూ.9500 జీతంతోనే రెంట్ కడుతూ.. పిల్లలను చూసుకుంటోంది. ఈ క్రమంలోనే పుష్పలత అనారోగ్యం పాలైంది. ఆస్పత్రికి వెళ్లి చూపించుకోగా.. కడుపులో గడ్డ ఉందని.. దాన్ని తొలగించేందుకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. చికిత్సకు రూ.2లక్షలకు పైగా ఖర్చు అవుతుందని తెలిపారు. దాంతో.. పుష్పలత ఆందోళన చెందింది. చాలీచాలని జీతంతో జీవితం భారం అయ్యిందని మనస్తాపం చెందింది. సూసైడ్ నోట్ రాసి గురువారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సూసైడ్ నోట్‌లో రూ.9500 జీతం చాలకపోవడం.. అది కూడా సకాలంలో అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని పేర్కొంది. అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని రాసుకొచ్చి ఆత్మహత్య చేసుకుంది.