Medchal: మద్యం మత్తులో కారు నడిపిన మైనర్లు, చెట్టును ఢీకొట్టి ఇద్దరు మృతి
మద్యం మత్తులో వేగంగా కారు నడిపారు మైనర్లు. ఆ తర్వాత చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 7 Oct 2023 12:20 PM ISTMedchal: మద్యంమత్తులో కారు నడిపిన మైనర్లు, చెట్టును ఢీకొట్టి ఇద్దరు మృతి
వాళ్లు మైనర్లు. పైగా ఫుల్లుగా మద్యం సేవించారు. ఆ మత్తులో కారును మితిమీరిన వేగంతో నడిపి ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
మైకం ఎక్కే వరకు మద్యం సేవించి ఎంజాయ్ చేస్తున్నాం అనుకున్నారు యువకులు. కానీ ఆ మత్తులో వాహనం నడిపితే ఏం జరుగుతుందో మర్చిపోయారు. చివరకు తిరిగిరాని లోకానికి వెళ్లారు. వారి తల్లిదండ్రు లకు కడుపుకోత మిగిల్చారు. భూమేష్, తుషార్, ఫిలిప్స్, రూబిన్ హరిప్రియ ఈ ఐదుగురు కలిసి బెలీనో కారులో మద్యం సేవిస్తూ ఆ మత్తులో అత్యంత వేగంగా కారును నడిపారు. కీసర చౌరస్తా నుండి యద్గర్పల్లి వైపు వెళ్తున్న సమయంలో కారు ఒక్కసారి గా అదుపుతప్పింది. వేగంగా వెళ్లి గోశాల వద్ద ఉన్న చెట్టును ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణి స్తున్న ఐదుగురిలో ఓ యువతి తుషార, యువకుడు భవేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో.. అక్కడికక్కడే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో ముగ్గురురుబెన్, ఫిలిప్స్, హరిప్రియకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగే సమయంలో రూబెన్ కారు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే.. కారులో మద్యం బాటిళ్లను గుర్తించామని.. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మద్యం మత్తులో కారు అత్యంత వేగంగా నడపడం వల్లే రోడ్డుప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం తీవ్రగాయాలైన ముగ్గురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.