జువెలరీ షాపులో చోరీ.. ప్రియురాలితో కలిసి తీర్థయాత్రలకు ట్రిప్
చేసిన పాపం ఊరికే పోదంటారు. దొంగలు కూడా ఎప్పటికైనా దొరకాల్సిందే.
By Srikanth Gundamalla Published on 19 Aug 2024 4:39 AM GMTజువెలరీ షాపులో చోరీ.. ప్రియురాలితో కలిసి తీర్థయాత్రలకు ట్రిప్
చేసిన పాపం ఊరికే పోదంటారు. దొంగలు కూడా ఎప్పటికైనా దొరకాల్సిందే. అయితే.. ఓ వ్యక్తి తాను చేస్తున్న షాపుకే కన్నం పెట్టాడు. ఆ తర్వాత పాపం కడిగేసుకుందాం అనుకున్నాడో ఏమో కానీ.. ప్రియురాలితో కలిసి ఆలయాల సందర్శనకు వెళ్లాడు. కానీ.. చివరకు పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో జరిగింది.
చంద్రనగర్‌కు చెందిన మర్రి సాయిలక్ష్మణ్ గత ఎనిమిదేళ్లుగా బషీర్‌బాగ్‌లోని శ్రీసిద్ధి వినాయక జువెలర్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నాడు. అయితే.. అంతకాలం నుంచి పనిచేస్తున్న ఇతను ఉన్నట్లుండి ఉద్యోగం మానేశాడు. రెండు నెలల పాటు ఎవరికీ అందుబాటులోకి రాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దాంతో.. అనుమానం వచ్చి యాజమాన్యం జువెలరీ షాపులో ఆడిట్ నిర్వహించింది. ఈ లెక్కల్లో 28 గ్రాముల బంగారం కనిపించకుండా పోయినట్లు గుర్తించారు.
దాంతో.. శ్రీ సిద్ధి వినాయక జువెలర్స్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో... ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు చెప్పింది విని విస్తుపోయారు. కనిపించకుండా పోయిన 28 గ్రాముల బంగారంతోపాటు 8 గ్రాముల డైమండ్ నెక్లెస్‌ను కూడా దొంగిలించినట్టు అంగీకరించాడు. వాటిలో కొన్నింటిని మణప్పురం గోల్డ్‌లోన్ కంపెనీలో తాకట్టు పెట్టానని చెప్పాడు. ఆ డబ్బులతో తన ప్రియురాలితో కలిసి ఆలయాలను సందర్శించినట్లు చెప్పాడు. అతను చెప్పిన విషాయాలను విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు. అతడి నుంచి 3 గ్రాముల బంగారంతోపాటు తాకట్టు పెట్టిన డైమండ్ నెక్లెస్‌ను రికవరీ చేశారు పోలీసులు.