మంత్రాల నెపంతో తల్లికొడుకు దారుణ హత్య

మహబూబాబాద్ జిల్లా గూడురు మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  14 Feb 2024 4:30 AM GMT
mahaboobabad, double murder, mother, son ,

మంత్రాల నెపంతో తల్లికొడుకు దారుణ హత్య 

మహబూబాబాద్ జిల్లా గూడురు మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. మంత్రులు చేస్తున్నారనే నెపంతో ఓ యువకుడు తల్లికొడుకులను హతమార్చాడు. బోల్లేపల్లికి చెందిన ఆలకుంట సమ్మక్క, కొమురయ్య దంపతులు. వీరికి సమ్మయ్య అనే కుమారుడు ఉన్నారు. అయితే.. వీరి కుటుంబం మంత్రాలు చేస్తున్నారని అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ శివరాత్రి కుమారస్వామి కక్ష పెంచుకున్నాడు. ఇదే విషయంలో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి.

అయితే.. సమ్మయ్య తన కూతురు నిశ్చితార్థం కోసం ఐదు రోజుల క్రితమే తన కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చాడు. దాంతో..వారిని చూసిన కుమారస్వామి గూడూరులో శనివారం అడ్డుకుని తనపై సమ్మయ్య కుటుంబం మంత్రాలు చేస్తోందని మండిపడ్డాడు. అంతేకాదు.. వారి ఆటోను అడ్డుకుని దాడి చేసే ప్రయత్నం చేశాడు. దాంతో.. సమ్మయ్య అదే రోజు పోలీసులను ఆశ్రయించాడు. కుమారస్వామి తమపై దాడి చేశాడంటూ ఫిర్యాదు చేశాడు. ఇక ఆదివారం నిశ్చితార్ధం కార్యక్రమం పూర్తయ్యింది.

ఆ తర్వాత కేసు గురించి తెలుసుకునేందుకు సమ్మయ్య కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు బయల్దేరాడు. ఈ విషయం తెలుసుకున్న కుమారస్వామి.. గూడూరు అంబేద్కర్ సెంటర్‌లో సమ్మయ్య ఆటోను అడ్డుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్‌తో వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో సమ్మయ్య (40), తల్లి సమ్మక్క (60) తీవ్రంగా గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక తండ్రి కొమురయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమ్మయ్య భార్య రజిత ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

ఉన్మాదిలా దాడికి పాల్పడ్డ కుమారస్వామిని స్థానిక యువత పట్టుకుని స్తంభానికి కట్టేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. సమ్మయ్య భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story