ప్రేమ వివాహం..కానీ రోజు వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్న జంట
ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉన్నట్లుండి భార్య ఆత్మహత్య చేసుకుంది. రోజు వ్యవధిలో భర్త కూడా రైలు కింద పడి చనిపోయాడు.
By Srikanth Gundamalla Published on 8 Aug 2023 1:46 PM ISTప్రేమ వివాహం..కానీ రోజు వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్న జంట
యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పద్దతి ప్రకారమే పెళ్లి చేసుకోవాలని.. పెద్దలను ఒప్పించారు. ఇరువురి ఇళ్లలో నచ్చజెప్పి పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలల పాటు కాపురం సాఫీగానే సాగింది. కానీ ఉన్నట్లుండి ఏమైందో తెలియదు కానీ.. ఇద్దరూ ఒకరోజు వ్యవధిలో ప్రాణాలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రంలో జరిగిన ఈ సంఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
తాడిపత్రి మండలం చిన్నపోడమలకు చెందిన మంజునాథ్.. పుట్లూరు మండలం గరుగుచింతలపల్లికి చెందిన రమాదేవీలు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని .. తమ మనసులో మాటను తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఆరు నెలల క్రితమే వీరి వివాహం జరిగింది. మొన్నటి వరకు వీరి కాపురం సాఫీగానే సాగిందని తెలుస్తోంది. ఇంతలో ఏమైందో తెలియదు కానీ.. రమాదేవి ఆగస్టు 7న చల్లవారిపల్లి దగ్గర రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకున్న తర్వాత భర్త తట్టుకోలేకపోయాడు. భార్య లేని విషయం జీర్ణించుకోలేక మదనపడిపోయాడు. ఆ తర్వాత కొన్ని గంటలకే భర్త మంజునాథ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నపోడమల దగ్గర రైలు కింద పడి చనిపోయాడు.
అయితే.. తమ కూతురు మరణంపై రమాదేవి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. వరకట్న వేధింపుల కోసం తమ కూతురు ఆత్మహత్య చేసుకునేలా చేశారని అత్తింటివారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. రోజు వ్యవధిలో ఇద్దరు చనిపోవడం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వీరిద్దరి ఆత్మహత్యలకు గల కారణాలపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు చెప్పారు. పూర్తి దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు పోలీసులు.