దారుణం.. ఆస్తి కోసం కూతుర్ని చంపిన తండ్రి

ఆస్తిపాస్తుల ముందు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  10 Nov 2023 2:45 PM IST
khammam, father murder,  daughter,  property issues,

దారుణం.. ఆస్తి కోసం కూతుర్ని చంపిన తండ్రి

ఆస్తిపాస్తుల ముందు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. బంధాలు, అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. కేవలం ఆస్తులు మాత్రమే కావాలి ప్రేమ అనురాగాలు వద్దు అన్నట్లుగా తయారవుతోంది. సమాజాం. ఆస్తుల కోసమే ఈ మధ్య కాలంలో మర్డర్లు పెరుగుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఓ తండ్రి కన్న కూతురిని హతమార్చాడు.

ఆస్తికోసం తల్లిదండ్రులను సైతం హతమారుస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ కన్న పేగు కన్నా ఆస్తే మిన్న అనుకున్నాడు ఒక్క కసాయి తండ్రి. అందుకు పథకం వేసాడు. దాని ప్రకారమే కూతురు, అల్లుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో కూతురు అక్కడికక్కడే మృతి చెందగా... అల్లుడు పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణమైన ఘటన చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కన్నపిల్లల కంటే ఆస్తి ముఖ్యమా అంటూ పలువురు కంటతడి పెట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.... పిట్టల రాములు అనే వ్యక్తికి ఖమ్మం జిల్లాలోని వైరా మండలంలో ఉన్న తాటిపూడి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఉష అనే కూతురు ఉంది. ఉషకు, కృష్ణ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే తండ్రి కూతురు మధ్య భూ వివాదాలు, ఆస్తుల విషయంలో గొడవలు చెలరేగాయి. తండ్రి ఆస్తి కోసం కూతుర్నే చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ కసాయి తండ్రి కత్తి తీసుకొని కూతురుపై ఒక్కసారిగా దాడి చేశాడు. ఆ తర్వాత కత్తితో కూతురి కడుపులో పొడిచాడు. గమనించిన అల్లుడు అతడిని ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన అల్లుడిపై కూడా రాములు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఉషకు తీవ్ర గాయాలు కాగా.. తీవ్ర రక్తస్రావం అయ్యి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇక అల్లుడు కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతరం తండ్రి రాములు అక్కడి నుండి పరారయ్యాడు. స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న దంపతులను చూసి భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అల్లుడిని అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఇక ఉష మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేశామని..నిందితుడు రాములు కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

Next Story