దారుణం.. భర్తను కట్టేసి కొట్టి చంపిన భార్య
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో భార్య దారుణ సంఘటనకు పాల్పడింది.
By Srikanth Gundamalla Published on 28 March 2024 2:27 PM IST
దారుణం.. భర్తను కట్టేసి కొట్టి చంపిన భార్య
దంపతుల మధ్య గొడవలు జరగడం సహజం. అదే రోజూ జరిగితే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితాన్ని ముందుకు సాగించాలి. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది దంపతులు ఈగోలకు పోతున్నారు. ఎదుటివారికి గౌరవం ఇవ్వడం లేదు. అంతేకాదు.. కొందరు గొడవలు పడుతూ తమ జీవితాలకే ముగింపు పలుకుతున్నారు. తాజాగా కరీంనగర్‌లో కూడా ఇద్దరు దంపతుల మధ్య గొడవలు జరిగాయి. విసిగిపోయిన భార్య దారుణానికి ఒడిగట్టింది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో భార్య దారుణ సంఘటనకు పాల్పడింది. కట్టుకున్న భర్తను కట్టేసి తీవ్రంగా కొట్టింది. దాంతో.. ఆ దెబ్బలతో తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోహిణి అనే మహిళ పనిచేస్తోంది. ఆమె తన భర్తతో తరచూ గొడవలు పడుతుండేది. కారణాలు ఏమిటో తెలియదు కానీ.. గొడవలు మాత్రం జరిగేవనీ.. ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం కూడా భర్తతో రోహిణి ఘర్షణ పడింది. దాంతో.. తీవ్ర కోపోద్రిక్తురాలు అయ్యి భర్తను కట్టేసి తీవ్రంగా దాడి చేస్తూ హింసించింది. దాంతో..తీవ్ర గాయాలపాలైన అతను గురువారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించారు. ఈ దారుణ సంఘటనపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని కరీంనగర్ పోలీసులు తెలిపారు.