యువకుడి ప్రాణం తీసిన తల్లిదండ్రుల మధ్య గొడవ
కరీంనగర్‌లో తల్లిదండ్రుల మధ్య గొడవ ఓ యువకుడి ప్రాణాలను తీసింది.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 10:25 AM ISTయువకుడి ప్రాణం తీసిన తల్లిదండ్రుల మధ్య గొడవ
భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. కానీ.. అవి రోజూ జరిగితే మాత్రం కాస్త ఇబ్బందికర విషయమే. ఇంట్లో ఉన్న పిల్లలపై ఆ గొడవల ప్రభావం పడుతుంది. అయితే.. పిల్లలు పెద్దవారు అయినా గొడవలు జరిగితే ప్రశాంతత ఉండదు. కరీంనగర్‌లో తల్లిదండ్రుల మధ్య గొడవ ఓ యువకుడి ప్రాణాలను తీసింది. తల్లిదండ్రులు నిత్యం గొడవ పడుతున్నారని.. తాను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదని మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు బీటెక్ విద్యార్థి.
కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్‌లో చోటుచేసుకుంది ఈ విషాదకర సంఘటన. తల్లిదండ్రులు తరచూ గొడవపడుతుండటం చూడలేకపోయాడు తనయుడు. అదీ రోజూ జరుగుతుండటం చూసి ఆవేదన చెందాడు. గొడవ పడొద్దని చెప్పినా వారు వినలేదు. దాంతో మనస్తాపంతో ఆ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. నారాయణపూర్ గ్రామానికి చెందిన పడాల రమేశ్, రేణుక దంపతులు నివసిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు అభిలాష్ కరీంనగర్‌లోని ఇంజినీరింగ్ కాలేజ్‌లో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడే హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు అభిలాష్.
అయితే.. ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో అభిలాష్ ఇంటికి వచ్చాడు. వారం రోజుల కిందటే ఇంటికి వచ్చాడు. అతడి తల్లిదండ్రులు రోజూ గొడవపడటం చూశాడు. ఆవేదన చెందాడు. శుక్రవారం కూడా అభిలాష్ తల్లిదండ్రుల మధ్య గొడవ జరిగింది. పెద్దదిగా అవుతుండటంతో కొడుకు అభిలాష్ కలుగజేసుకుని వద్దంటూ వారించాడు. కానీ.. వారు కొడుకు మాట వినలేదు. గొడవపడుతూనే ఉన్నారు. దాంతో.. అభిలాష్ మనస్థాపం చెందాడు. రోజూ గొడవపడటంతో ఊర్లో పరువు పోతుందని వేదనకు గురయ్యాడు. ఇక ఇంట్లో ఉండొద్దని నిర్ణయించుకుని.. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. వెంటనే పొలం వద్దకు వెళ్లా పురుగుల మందు తాగాడు. అది గమనించిన పక్కపొలంలో ఉండే వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దాంతో.. వెంటనే అభిలాష్‌ను పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. సీరియస్‌గా ఉంది కరీంనగర్‌కు తీసుకెళ్లాలని చెప్పడంతో తల్లిదండ్రులు అదే చేశారు. కానీ.. మార్గమధ్యలోనే అభిలాష్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనపై అభిలాష్ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. దసరా పండుగ వేళ కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.