హీరో దర్శన్ ను పట్టించిన సీసీటీవీ విజువల్స్

, CCTV ఫుటేజీలో హత్య స్థలంలో నటుడుకి చెందిన ఎరుపు రంగు జీప్ కనిపించింది.

By Srikanth Gundamalla  Published on  12 Jun 2024 7:30 PM IST
kannada actor, darshan, red car,  murder place,

హీరో దర్శన్ ను పట్టించిన సీసీటీవీ విజువల్స్ 

బెంగళూరు పోలీసులు కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప, అతని భార్య పవిత్ర గౌడను అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత, CCTV ఫుటేజీలో హత్య స్థలంలో నటుడుకి చెందిన ఎరుపు రంగు జీప్ కనిపించింది. మృతదేహాన్ని డంప్ చేయడానికి ఉపయోగించిన స్కార్పియో కారు వెంట జీప్ వెళ్లడం కనిపించింది. రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కూడా నిందితులను సంఘటనా స్థలానికి తీసుకెళ్లి క్రైం సీన్‌ను రీక్రియేట్ చేశారు. 'ఛాలెంజింగ్ స్టార్'గా పేరొందిన దర్శన్‌తో పాటు మరో 12 మందిని ఈ హత్యలో వారి పాత్రపై కస్టడీలోకి తీసుకుని విచారించారు. చనిపోయిన వ్యక్తిని రేణుకాస్వామిగా గుర్తించగా, అతని మృతదేహం జూన్ 9న లభ్యమైంది.

ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. చట్టం అందరికీ ఒకటేనని, ఈ కేసులో దోషులుగా తేలిన వారికి శిక్ష తప్పకుండా పడుతుందని మంత్రి అన్నారు. నటుడు దర్శన్‌ను హత్య కేసులో అరెస్టు చేసిన తరువాత ఆరు రోజుల పోలీసు కస్టడీకి రిమాండ్ విధించారు. దర్శన్ ను బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టులో కూడా హాజరుపరిచారు. దర్శన్ సహాయకులలో ఒకరికి చెందిన పట్టనగెరెలోని షెడ్‌లో హత్య చేసిన తర్వాత, రేణుకస్వామి మృతదేహాన్ని సమీపంలోని మురుగునీటి కాలువలో పడవేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కొంతమంది స్థానికులు మృతదేహం గురించి సమాచారం అందించడం పోలీసులు ఈ సంఘటన గురించి తెలుసుకున్నారు. తరువాత మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపారు. ఫోరెన్సిక్ నివేదిక హత్య చేశారని నిర్ధారించింది. తదుపరి విచారణలో 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Next Story