దారుణం.. పెళ్లి రోజే భార్యను కిరాతకంగా చంపిన భర్త

ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం సంతోషంగానే ఉన్నారు.

By Srikanth Gundamalla  Published on  1 March 2024 10:27 AM IST
kakinada, husband ,murder,  wife,  marriage anniversary,

 దారుణం.. పెళ్లి రోజే భార్యను కిరాతకంగా చంపిన భర్త 

ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం సంతోషంగానే ఉన్నారు. కానీ.. వీరి దాంపత్య జీవితంలో మొదలైన అనుమాన భూతం గొడవలను సృష్టించింది. మనశ్శాంతి లేకుండా చేయడమే కాదు.. చివరకు హత్యకు దారి తీసింది.

కాకినాడలోని వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పప్పులమిల్లు ప్రాంతానికి చెందిన నూకరాజు, దివ్య 2016లో ఫిబ్రవరి 29న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎనిమిదేళ్ల కాపురంలో వీరికి ఒక పాప, ఒక బాబు కూడా పుట్టారు. అయితే.. భర్త నూకరాజు ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్ట్‌ పనులు చేస్తుంటారు. ఆ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాడు. అక్కడే రెండుమూడ్రోజులు ఉండి ఆ తర్వాత ఇంటికొస్తాడు. అయితే.. ఈ క్రమంలోనే కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు నూకరాజు. తాను ఇంట్లో లేని సమయంలో ఏం చేస్తున్నావ్? ఎవరితో మాట్లాడుతున్నావంటూ ప్రశ్నించడం అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి.

ఫిబ్రవరి 29న వీరి పెళ్లిరోజు. నాలుగేళ్లకు ఒకసారి తమ ఆనివర్సిరీ వస్తుందనీ ఇంటికి వచ్చాడు భర్త నూకరాజు. కానీ.. ఆరోజు కూడా ఉదయం ఇదే విషయంలో గొడవపడ్డారు. వారి ఇంట్లో నుంచి పెద్దగా కేకలు వినిపించాయి. ఇక స్థానికులు ఆ మాటలు విన్నా.. తరచూ జరిగేదే అన్నట్లు పట్టించుకోలేదు. ఇక కాసేపటికే ఇంట్లో నుంచి దివ్య పరుగెత్తుకుంటూ బయటకు వచ్చింది. ఆమె వెంటనే భర్త నూకరాజు కత్తితో వచచాడు. వీధిలోనే భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దాంతో.. దివ్య మెడపై తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రరక్త స్రావమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇక దివ్యపై దాడిని ఆపేందుకు ప్రయత్నించిన బంధువులపైనా నూకరాజు దాడి చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశామని చెప్పారు. హత్య చేసిన తర్వాత నిందితుడు నూకరాజు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story