బద్వేల్ ఇంటర్ విద్యార్థిని హ‌త్య కేసులో సంచలన విషయాలు

వైఎస్ఆర్ జిల్లా బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి కేసును పోలీసులు ఛేదించారు. కడపలో నిందితుడు విఘ్నేష్ను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్రాజు తెలిపారు.

By Kalasani Durgapraveen  Published on  20 Oct 2024 9:30 PM IST
బద్వేల్ ఇంటర్ విద్యార్థిని హ‌త్య కేసులో సంచలన విషయాలు

వైఎస్ఆర్ జిల్లా బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థిని హ‌త్య‌ కేసును పోలీసులు ఛేదించారు. కడపలో నిందితుడు విఘ్నేష్‌ను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్‌ తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు జిల్లా ఎస్పీ వెల్ల‌డించారు.

మృతురాలికి, నిందితుడు విఘ్నేష్‌తో ఐదేళ్లుగా పరిచయం ఉంది. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. విఘ్నేష్ కడపలోని ఓ హోటల్లో వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం అతడికి వివాహం కాగా.. భార్య గర్భిణి. శుక్రవారం ఉదయం అతడు విద్యార్థినికి ఫోన్ చేసి తనను కలవాలని కోరాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బాధిత బాలికను బెదిరించాడు. దీంతో ఆ బాలిక శనివారం కళాశాల నుంచి ఆటోలో బయలుదేరగా.. విఘ్నేష్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఆ ఆటో ఎక్కాడు. ఇద్దరూ బద్వేలుకు పది కి.మీ. దూరంలో ఉన్న సెంచురీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ వద్ద ఆటో దిగి.. సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లి ఇద్దరూ కాసేపు సరదాగా గడిపారు. తనను పెళ్లి చేసుకోవాలని బాలిక అడగడంతో.. కోపంతో రగిలిపోయిన విఘ్నేష్ బాలికకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాలిక కడప రిమ్స్ చికిత్స పొందుతూ అర్ధరాత్రి 2.30 గంటలకు మృతి చెందింది.

బాలికను ఏదో ఒకటి చేయాలనే పథకంతోనే విఘ్నేశ్ ఆమెకు ఫోన్ చేశాడు. కడప నుంచి వచ్చేటప్పుడు ముందుగానే పెట్రోల్ బాటిల్ బ్యాగ్‌లో పెట్టుకొని బయల్దేరాడు. పథకం ప్రకారమే ఆమెపై పెట్రోల్‌తో దాడి చేశాడు. గతంలో కూడా ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన రావడంతో విఘ్నేష్.. కొంత కాలం దూరం పెట్టాడు. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ దగ్గరయ్యారు. పెళ్లి చేసుకోవాలని శనివారం కూడా బాలిక ఒత్తిడి చేయడంతో విఘ్నేశ్ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఘటనా స్థలంలో అన్ని ఆధారాలు సేకరించాం అని ఎస్పీ తెలిపారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చూస్తాం అన్నారు.

Next Story