ఇన్‌స్టాలో బ్లాక్ చేసిన భార్యను దారుణంగా చంపిన భర్త
ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేసినందుకు భార్యను భర్త కిరాతకంగా హత్య చేశాడు.
By Srikanth Gundamalla Published on 14 Aug 2023 5:39 PM ISTఇన్‌స్టాలో బ్లాక్ చేసిన భార్యను దారుణంగా చంపిన భర్త
సోషల్ మీడియా కొందరిని స్టార్లు చేస్తుంటే.. ఇంకొందరి ప్రాణాలకు మీదకు తెస్తోంది. తాజాగా భార్యకు ఇన్‌స్టాలో ఫాలోవర్స్ ఎక్కువగా ఉండటంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమె భర్తను బ్లాక్ లిస్ట్‌లోకి చేర్చడంతో అనుమానం మరింత బలపడింది. ఇన్‌స్టా విషయంలోనే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఒక రోజు గొడవ పెద్దది కావడంతో.. భార్యను గొంతు నులిమి చంపేశాడు భర్త. అది కూడా కన్న పిల్లల ముందే. ఈ దారుణ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోలో నివాసం ఉంటోన్న ఓ వ్యాపారవేత్త (37)కు భార్య, 12 ఏళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. అతని భార్య హౌస్ వైఫ్. ఇంట్లోనే ఉండటంతో ఆమె రీల్స్, ఫోటోస్ దిగి ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేస్తుండేది. ఆ క్రమంలో ఆమెకు ఫాలోవర్స్ బాగా పెరిగిపోయారు. భార్యకు ఫాలోవర్స్ పెరగడంతో భర్త అసూయపడ్డాడు. ఈ విషయంలో చిన్నచిన్న గొడవలు జరుగుతుండేవి. దాంతో.. సదురు మహిళ భర్తను ఇన్‌స్టాలో బ్లాక్ చేసింది. ఆ చర్యతో భర్తకు అనుమానం పెరిగింది. ఇక రోజూ గొడవపడేవారు. ఇన్‌స్టాలో ఎందుకు బ్లాక్ చేశావ్ అని.. ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకున్నావ్ అంటూ భార్యను వేధించాడు.
ఆగస్టు 13న ఆదివారం కావడంతో పిల్లలతో కలిసి భార్యాభర్తలు ఇద్దరూ కారులో బయటకు వెళ్లారు. అలా వెళ్తుండగా గొడవ మళ్లీ మొదలైంది. మాటామాటా పెరిగింది. దీంతో.. కోపంతో భార్యను పిల్లల ముందే గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత అదే వాహనంలో లాక్ చేసుకుని ఉండిపోయాడు భర్త. అయితే.. కారు ఎక్కువ సేపు అక్కడే అనుమానాస్పదంగా ఆగివుండటంతో పెట్రోలింగ్ బృందం సమాచారాన్ని పోలీసులకు అందించారు. పోలీసులు వచ్చి బలవంతంగా కార్ డోర్లు ఓపెన్ చేసి చూడగా హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక పిల్లలు కూడా నాన్నే తమ తల్లిని చంపేశాడంటూ పోలీసుల ముందు చెప్పారు. పిల్లల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.