ఎం.ఏ. చదివి..ఈజీ మనీ కోసం హాష్ అయిల్‌ దందా మొదలెట్టాడు..!

రాచకొండ పోలీసులు ఒక అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్‌ను పట్టుకున్నారు. రూ.42 లక్షల విలువచేసే 3 లీటర్ల హాష్ ఆయిల్ సీజ్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on  4 Aug 2023 12:57 PM GMT
Hash Oil, Seized, SOT Police, Man arrested, Rachakonda Police,

ఎం.ఏ. చదివి..ఈజీ మనీ కోసం హాష్ అయిల్‌ దందా మొదలెట్టాడు..!

రాచకొండ పోలీసులు ఒక అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్‌ను పట్టుకున్నారు. మాదకద్రవ్యాలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న ముఠాలపై ఎస్ఓటి బృందం నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే భువనగిరి ఎస్ఓటి బృందం ఆలేరు పోలీసులతో కలిసి అక్రమంగా హాష్ ఆయిల్ ని హైదరాబాదుకు తరలిస్తున్న ముఠాను పట్టుకొని వారి వద్ద నుండి రూ.42 లక్షల విలువచేసే మూడు లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.

మహబూబాబాద్ జిల్లా గూడూరు గ్రామానికి చెందిన అజ్మీర్ సూర్య(34) అనే వ్యక్తి ఎం.ఏ., బి.ఈడి పూర్తి చేశాడు. అనంతరం ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ కు వచ్చి ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేశాడు. అయితే కోవిడ్ 19 కారణంగా అతను తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. దీంతో సూర్య తిరిగి తన సొంత పట్టణానికి వెళ్లి అక్కడ ఒక డైరీ ఫామ్ లో పనిచేస్తూ జీవనం కొనసాగించాడు. కానీ అతనికి వచ్చే ఆదాయంతో సంతృప్తిగా లేడు. సూర్య సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఐడి లిక్కర్ను తయారుచేసి అవసరమైన వినియోగదారులకు సరఫరా చేసేవాడు. 2022లో గూడూరు ఎక్సైజ్ పోలీసులు ఐడి లిక్కర్ కి సంబంధించి మూడు కేసులో నిందితుడు సూర్యను అరెస్టు చేసి అతనిపై పీడియాక్ట్ నమోదు చేశారు. దీంతో సూర్య జైలుకు కూడా వెళ్లాడు.

జైల్లో రాము అనే వ్యక్తితో సూర్యకు పరిచయం ఏర్పడింది. సూర్య జైలు నుండి విడుదలైన అనంతరం రామును సంప్రదించాడు. ఈ ఇద్దరు కలిసి లక్ష్మణ్ అనే వ్యక్తి వద్ద లక్ష రూపాయలు పెట్టి మూడు లీటర్ల హాష్ ఆయిల్ ను కొనుగోలు చేసి వరంగల్ కి వెళ్లారు. అనంతరం సూర్య వరంగల్ నుండి హాష్ ఆయిల్ తీసుకొని హైదరాబాద్, జహీరాబాద్‌లో ఎక్కువ ధరకు విక్రయించేందుకు బయలుదేరాడు. భువనగిరి ఎస్ఓటి బృందానికి విశ్వసనీయమైన సమాచారం రావడంతో ఆలేరు పోలీసులతో కలిసి ఆలేరు రోడ్డు వద్ద మాటు వేశారు. గురువారం సాయంత్రం హాష్ ఆయిల్ తీసుకొని వస్తున్న సూర్యను పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుండి 40 -42 లక్షల విలువ చేసే మూడు లీటర్ల హాష్ ఆయిల్, ఒక ద్విచక్ర వాహనం, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సూర్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాము, లక్ష్మణ్ మరో ఇద్దరు పరారీలో ఉన్నారనీ... వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Next Story