హన్మకొండ: డబ్బుల కోసం అత్తను తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్
డబ్బుల విషయంలో అత్త, అల్లుడి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అల్లుడు విచక్షణ కోల్పోయి అత్తను తుపాకీతో కాల్చి చంపాడు.
By Srikanth Gundamalla Published on 12 Oct 2023 9:15 AM GMTహన్మకొండ: డబ్బుల కోసం అత్తను తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్
హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. డబ్బుల విషయంలో అత్త, అల్లుడి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో.. ఆగ్రహానికి గురైన అల్లుడు విచక్షణ కోల్పోయి అత్తను తుపాకీతో కాల్చి చంపాడు. కాగా.. నిందితుడు పోలీస్ కానిస్టేబుల్. ఈ దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కమల.. కొన్నేళ్ల క్రితం ప్రసాద్ అనే వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే.. కొన్నాళ్లుగా ప్రసాద్‌కు అతని భార్యకు పడటం లేదు. దాంతో..ఇద్దరూ తరచూ గొడవపడుతున్నారు. ఈ క్రమంలో ప్రసాద్‌పై అతని భార్య పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ప్రసాద్ మద్యానికి బానిస అయ్యాడని.. ఇంట్లో దేని గురించి పట్టించుకోవడం లేదని అతని భార్య ఆరోపిస్తుంది. మద్యానికి బానిస కావడంతో భార్య వెళ్లి కొన్నాళ్లుగా పుట్టింట్లోనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే.. అంతకు ముందే కమల ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. దాంతో.. కానిస్టేబుల్ ప్రసాద్ తన అత్త ఇబ్బందులను గుర్తించి రూ.4లక్షల అప్పుగా ఇచ్చాడు.
అయితే.. తాజాగా ఆ డబ్బుల కోసమే కానిస్టేబుల్ ప్రసాద్ కమల ఇంటికి వెళ్లాడు. డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. దాంతో.. అల్లుడు, అత్త మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రసాద్.. తన వెంట తెచ్చుకున్న సర్వీస్ రివాల్వర్‌ను బయటకు తీసి అత్త కమలపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో కమల తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానికులు ప్రసాద్‌ను పట్టుకుని చితకబాదారు. అతడిపై రాళ్లదాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గాయాలపాలైన ప్రసాద్‌ను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా..ప్రసాద్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తోటపల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది.