ఘట్కేసర్‌లో కిడ్నాపైన చిన్నారిని తల్లి చెంతకు చేర్చిన పోలీసులు

జూలై 5న రాత్రి ఘట్కేసర్‌లో కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల చిన్నారి కృష్ణవేణిని పోలీసులు కాపాడారు

By Srikanth Gundamalla  Published on  6 July 2023 4:47 PM IST
Ghatkesar, Girl Kidnap, Case, CP Chauhan,

ఘట్కేసర్‌లో కిడ్నాపైన చిన్నారిని తల్లి చెంతకు చేర్చిన పోలీసులు

జూలై 5న రాత్రి ఘట్కేసర్‌లో కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల చిన్నారి కృష్ణవేణిని పోలీసులు కాపాడారు. ఆ తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా చిన్నారిని క్షేమంగా పాప తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారిని రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ స్వయంగా ఎత్తుకుని వచ్చి తల్లి చెంతకు చేర్చారు. కిడ్నాప్‌కు గురైన పాప తిరిగి క్షేమంగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులంతా ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు.

బాధిత చిన్నారి ఇంటి దగ్గరే నివాసం ఉంటోన్న సురేశ్‌ జూలై 5న రాత్రి 8 గంటలకు చిన్నారిని కిడ్నాప్‌ చేశాడు. చాక్లెట్‌ ఇప్పిస్తానని బయటకు తీసుకెళ్లి అపహరించాడు. ఇక తల్లిదండ్రుల ద్వారా ఫిర్యాదు అందుకున్న ఘట్కేసర్ పోలీసులు వెంటనే స్పందించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడు సురేశ్‌ను పోలీసులు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో గుర్తించారు. చిన్నారిని కాపాడారు. తాజాగా పాపను ఆమె తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. 'పాప కిడ్నాప్‌ గురైన ఫిర్యాదు రాగానే పోలీసులను అప్రమత్తం చేశాం. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టాం. పరిసరాల్లోని అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాం. తద్వారా కిడ్నాపర్‌ సురేశ్‌గా గుర్తించాం. పోలీసు బృందాలు గాలింపు చేపట్టిన సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సురేశ్ అనుమానాస్పదంగా కనిపంచాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని మాకు సమాచారం అందించారు. అనంతరం చిన్నారిని రక్షించి.. నిందితుడు సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నాం. పాప తల్లిదండ్రులకు సమాచారం అందించి.. క్షేమంగా వారికి అప్పగించాం. సురేశ్‌ను విచారిస్తున్నాం' అని రాచకొండ సీపీ చౌహాన్ అన్నారు.

ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులందరికి ధన్యవాదాలు తెలిపారు సీపీ చౌహాన్. రాచకొండ పరిధిలో ఎలాంటి నేరం జరిగినా నిందితులను 24 గంటల్లో పట్టుకుంటున్నామని.. నేరాలను అదుపు చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు రాచకొండ సీపీ చౌహాన్.

Next Story