స్వీట్‌బాక్స్‌లో రూ.5లక్షల విలువైన హాష్‌ఆయిల్ సీజ్, వృద్ధుడు అరెస్ట్

మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా కనిపించాడు.

By Srikanth Gundamalla  Published on  29 Feb 2024 9:15 PM IST
drug Enforcement,  medchal, dundigal police station,

 స్వీట్‌బాక్స్‌లో రూ.5లక్షల విలువైన హాష్‌ఆయిల్ సీజ్, వృద్ధుడు అరెస్ట్

మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా కనిపించాడు. దాంతో.. పోలీసులు అతన్ని తనిఖీ చేయగా అతను స్మగ్లింగ్‌ తెలివిని చూసి షాక్‌ అయ్యారు. స్వీట్‌ డబ్బాలో హాష్‌ ఆయిల్‌ను తరలిస్తూ పట్టుబడ్డాడు.

ఆంద్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చెందిన శంకర్‌రావు అనే వృద్ధుడు దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గండి మైసమ్మ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. దాంతో.. పోలీసులు అతన్ని అడ్డుకుని ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకు అటూ ఇటూ తిరుగుతున్నావని నిలదీశారు. ఇక భయంతో వణికిపోయిన వృద్ధుడిని పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా స్వీట్‌ బాక్సును గుర్తించారు. ఆ తర్వాత దానిని ఓపెన్ చేసి చూసి కంగుతిన్నారు. స్వీట్‌ బాక్సులో హాష్‌ ఆయిల్‌ ప్యాకెట్‌ ను పోలీసులు గుర్తించారు. దాంతో.. ఎస్వోటీ పోలీసులు సదురు వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. నిందితుడి వద్ద పట్టుబడ్డ హాష్‌ ఆయిల్‌ విలువ రూ.5లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

విచారణలో భాగంగా మరిన్ని విషయాలు తెలుసుకున్నారు పోలీసులు. గతంలో కూడా స్మగ్లింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు. 2019 మార్చి 1వ తేదీన 744.2 కిలోల గంజాయిని తరలిస్తూ రాజేంద్రనగర్‌ పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో కోర్టు శంకర్‌రావుకి నాలుగేళ్ల ఏడు నెలల జైలు శిక్ష విధించింది. ఇక జైలు శిక్ష తర్వాత బయటకు వచ్చిన శంకర్‌రావు తన బుద్ధిని మార్చుకోలేదు. మళ్లీ స్మగ్లింగ్‌ చేయబోయాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. కాగా.. తాజాగా హాష్‌ ఆయిల్‌ ఎవరి నుంచి తీసుకున్నాడు? ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఇలా తదితర విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story