సైబర్ నేరగాళ్ల వలలో బెంగాలీ నటి, రూ.లక్షకు టోకరా

ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు

By Srikanth Gundamalla
Published on : 10 Sept 2023 11:09 AM IST

Cyber Crime, Bengali Actress, Sreelekha, lose Money,

సైబర్ నేరగాళ్ల వలలో బెంగాలీ నటి, రూ.లక్షకు టోకరా

ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్టుబడులంటూ ..ఆఫర్లు అంటూ వల విసిరి నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. వీరి చేతిలో చదవుకోని వారే కాదు.. బాగా చదువుకున్నవారు కూడా మోసపోతున్నారు. లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నారు. పోలీస్‌ అధికారులు ఎన్నిసార్లు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసినా.. సైబర్‌ నేరాల ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఒక్క లింక్‌పై క్లిక్‌ చేస్తే చాలు.. మన వివరాలన్నీ వెళ్లిపోతున్నాయి. అయితే.. తాజాగా ఓ బెంగాలీ నటి సైబర్ నేరగాళ్ల వలలో పడింది.

ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఏకంగా కొన్ని నిమిషాలలోనే ఆమె లక్ష రూపాయలు పోగొట్టుకున్నారు. ఆమెకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది శ్రీలేఖ మిత్ర. తనలా ఎవరూ మోసపోవదంటూ పేర్కొన్నారు. ఇక ఆ పోస్ట్ ఈ ఘటన ఆగస్టు 29న జరిగినట్లు తెలిపారు శ్రీలేఖ మిత్ర. అయితే.. ఆ సమయంలో తాను జ్వరంతో ఉన్నట్లు తెలిపారు. సైబర్ నేరగాళ్లు తనకు ఫోన్ చేసి విద్యుత్ బిల్లు చెల్లించేందుకు ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని తనని ఒప్పించారని తెలిపారు. బిల్లు ఈజీగా కట్టేందుకు వారు చెప్పినట్లు చేసింది నటి. దాంతో.. క్షణాల్లోనే బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్షకు పైగా డబ్బులు మాయం అయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. జ్వరంతో బాధపడుతున్న సందర్భంగా.. సైబర్‌ నేరగాళ్లు చెబుతున్నదాన్ని పసిగట్టలేకపోయినట్లు ఆమె పేర్కొన్నారు. ఇక మీదట తనలా ఎవరూ మోసపోవద్దనే తను పోస్టు పెడుతున్నట్లు నటి శ్రీలేఖ మిత్ర వెల్లడించారు. ఇలాంటి అన్‌నోన్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే.. ఆ తరువాత రోజే నటి పుట్టిన రోజు కావడం విశేషం. అంటే పుట్టిన రోజు ముందురోజు బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రకు చేదు అనుభవం ఎదురయ్యింది.

Next Story