భార్యపై అనుమానం.. పెళ్లయిన 3 నెలలకే దారుణ హత్య
కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు. పెళ్లయిన మూడు నెలలకే ఆమెను హతమార్చాడు.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 7:06 AM ISTభార్యపై అనుమానం.. పెళ్లయిన 3 నెలలకే దారుణ హత్య
కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు. పెళ్లయిన మూడు నెలలకే ఆమెను హతమార్చాడు. ఆ తర్వాత ఈ హత్యను మరొకరిపై మోపేందుకు ప్రయత్నించాడు సీఆర్‌పీఎఫ్ జవాన్. చివరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
బొబ్బిలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా బంగారమ్మ పేటకు చెందిన తాడూతూరి అనూష (22)ని జూన్ 16న రాత్రి 11 గంటల సమయంలో భర్త జగదీశ్ (30) పక్కా ప్లాన్‌తో తాడుతో మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత గతంలో ఉన్న పరిచయాలతో ప్రసాద్ వేధిస్తున్నాడనీ.. అందుకే చనిపోతున్నా అన్నట్లుగా మొబైల్ ఫోన్ నుంచి తండ్రి, అన్న, స్నేహితుడితో పాట తనకు కూడా భార్య ఫోన్ నుంచి మేసేజ్ పంపించాడు. ఆ మెసేజ్‌లను నమ్మిన మృతురాలి కుటుంబ సభ్యులు ప్రసాద్ ఇంటిపై దాడికి వెళ్లారు. చివరకు పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిన అదుపు చేశారు. ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. మృతురాలితో ప్రసాద్ ఎలాంటి సంభాషణలు జరపలేదని వెల్లడించారు. పోలీసులు కూడా దీన్ని నిర్ధారించారు. మృతురాలు పంపిన ఎసేజ్‌లో ఒకేసారి నలుగురికి ఎలా వెళ్లాయనే కోనంలో ఆరా తీశారు. భర్తను కూడా విచారించారు. దాంతో.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేశారని అనూషను పుట్టింట్లో వదిలి ఉద్యోగానికి వెళ్లాడు. అప్పటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. హత్యకు వారం రోజుల ముందు భార్యను తీసుకుని విజయనగరం తదితర ప్రాంతాల్లో తిరిగడు. ఉద్యోగం పనిపై వచ్చానని చెప్పి మళ్లీ పుట్టింటికి పంపాడు. ఆ తర్వాత విశాఖలో ఉన్నాడు. అక్కడి నుంచి 16వ తేదీన రాత్రి బంగారమ్పేట గ్రామానికి వచ్చాడు. భార్యను ఇంట్లో నుంచి బయటకు రావాలని చెప్పాడు. ఆమె ప్రవర్తన గురించి నిలదీశాడు. దాంతో.. ఆమె కేకలు వేసింది. అప్పటికే జేబులో తెచ్చుకున్న నైలాన్ తాడుతో భర్త జగదీశ్ భార్య మెడకు బిగించి ఊపిరిఆడకుండా చేశాడు. ఆమె చనిపోయిన తర్వాత భార్య ఫోన్ నుంచి ఒకేసారి మేసేజ్‌లను కాపీ చేసి ఫార్వార్డ్ చేశాడు. పాత సెల్‌ఫోన్ సిమ్ మూడ్రోజుల క్రితమే తీసేసి కొత్త సిమ్ కూడా తనపేరు మీద తీసుకున్నాడు. తన చేతులకు మట్టి అంటకుండా హత్య చేయాలనిఅనుకుని.. యూట్యూబ్‌లో వీడియోలు కూడా చూసి భర్త జగదీశ్ ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఇక ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.