జల్సాల కోసం 8 నెలల పసికందుని అమ్మేసిన తల్లిదండ్రులు
పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లిదండ్రులే బిడ్డను జల్సాల కోసం అమ్మేసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 28 July 2023 11:08 AM ISTజల్సాల కోసం 8 నెలల పసికందుని అమ్మేసిన తల్లిదండ్రులు
పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లిదండ్రులే బిడ్డను జల్సాల కోసం అమ్మేసుకున్నారు. కేవలం రూ.2లక్షలకు పసికందును అమ్మేసి కాస్ట్‌లీ ఫోన్ కొన్నారు. ఆ తర్వాత హనీమూన్ అంటూ వివిధ ప్రాంతాల్లో చక్కర్లు కొట్టారు. కానీ.. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యారు.
పశ్చిమ బెంగాల్‌లో ఓ జంట ఎనిమిది నెలల పసికందుని విక్రయించింది. జయదేవ్ ఘోష్, సతి అనే దంపతులు తమ బిడ్డను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బులతో కొత్త సెల్‌ఫోన్ కొన్నారు. ఆ తర్వాత హనీమూల్ అంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగారు. బెంగాల్‌లోని నార్త్ 24 పగరణాస్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హనీమూన్ కోసం దిఘా, మందరమణి సముద్ర తీరాలతో సహా అనేక ప్రాంతాలను సందర్శించారు. నెలన్నర కిందట దంపతులు బిడ్డను అమ్మి విహారయాత్రలు చేయగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. నిరుపేదలు అయిన ఈ జంట చేతిలో కొత్త కాస్ట్‌లీ ఫోన్ కనిపించడం.. వివిధ ప్రాంతాల్లో తిరగడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. అంతేకాక వీరి దగ్గర బిడ్డ కూడా కనిపించకపోవడంతో స్థానికులే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్థానికుల కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారి బిడ్డ గురించి ప్రశ్నించారు. పోలీసులల విచారణలో తమ బిడ్డను రూ.2లక్షలకు విక్రయించినట్లు ఒప్పుకున్నారు. ఇక అదే డబ్బుతో హనీమూన్ కోసం తిరిగినట్లు చెప్పారు. అయితే.. ఈ జంట నల్లమందు, గంజాయి కొనుగోలు కూడా చేస్తోందని స్థానికులుఆరోపించారు. సతి ఇతర వ్యక్తులను తన ఇంటికి తీసుకొచ్చేదని చెబుతున్నారు. కాగా.. పసిబిడ్డను ఎవరి అమ్మారో తెలుసుకున్న పోలీసులు.. ఆ తర్వాత రక్షించారు. పసికందను అక్రమంగా కొనుగోలు చేసిన ప్రియాంక ఘోష్ అనే మరో మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.