vikarabad: యువతిపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం, చర్యలకు ఎస్పీ ఆదేశం
వికారాబాద్ జిల్లాలో యువతిపై ఓ కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
By Srikanth Gundamalla Published on 29 Oct 2023 8:00 AM ISTvikarabad: యువతిపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం, చర్యలకు ఎస్పీ ఆదేశం
పోలీస్ అయినా లాయర్ అయినా రాజకీయ నాయకుడైన చివరకు సామాన్య జనుడైన సరే చట్టం దృష్టిలో అందరూ సమానమే. నేను పోలీస్.. నన్ను ఎవరు ఏమి చేయ లేరన్న మదంతో ఓ వ్యక్తి చేసిన ఆకృత్యాలపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న వెంటనే ఎస్పీ స్పందించి సదురు పోలీసులపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
వికారాబాద్ జిల్లా కేంద్ర సాయుధ బలగాల కార్యాలయంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నర్సింహులు ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన యువతి కుటుంబసభ్యులు అతనికి దేహశుద్ధి చేసి షీ టీమ్‌కు సమాచారం అందించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా, వికారాబాద్ మండలంలో జరిగింది. ఎస్పీ కోటిరెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నర్సింహులు శుక్రవారం అర్ధరాత్రి తన నివాసానికి దగ్గరలోని ఓ ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఓ గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న యువతిపై అత్యాచారయత్నం చేశాడు. దాంతో భయపడిపోయిన ఆమె కేకలు వేయడంతో పక్క గదిలో నిద్రిస్తున్న మహిళ మేల్కొని మిగతా కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసింది.
ఇంట్లోకి చొరబడ్డ కానిస్టేబుల్ కనిపించడంతో యువతి అన్నయ్య ఆగ్రహంతో హెడ్ కానిస్టేబుల్ నర్సింహులుకు దేహశుద్ధి చేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి చితక్కొట్టారు. ఆ తర్వాత షీ టీమ్‌కు సమాచారం అందించారు. అయితే.. ఫిర్యాదు చేయొద్దని బాధిత కుటుంబాన్ని కానిస్టేబుల్ బతిమాలాడు. కాని వారు ఏ మాత్రం అంగీకరించలేదు. క్షమించి వదిలేస్తే రేపు మరొకరికి జరిగే ప్రమాదం ఉందని భావించారు. దాంతో.. యువతి ఫిర్యాదుమేరకు వికారాబాద్ ఎస్‌ఐ అనిత కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి శనివారం ఆ హెడ్ కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు.