క్రైమ్ ప్యాట్రోల్ సీరియల్ ను చూసి ఆత్మహత్య చేసుకున్న 5వ తరగతి విద్యార్థిని

Class 5 Girl commits suicide after watching crime patrol.5వ తరగతి చదువుతున్న బాలిక 'క్రైమ్ ప్యాట్రోల్' చూసి షాకింగ్

By M.S.R  Published on  14 Dec 2021 3:01 PM IST
క్రైమ్ ప్యాట్రోల్ సీరియల్ ను చూసి ఆత్మహత్య చేసుకున్న 5వ తరగతి విద్యార్థిని

5వ తరగతి చదువుతున్న బాలిక 'క్రైమ్ ప్యాట్రోల్' చూసి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆమె ఏకంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన కుటుంబసభ్యులను, స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. అమ్మాయి ఎప్పుడూ క్రైమ్ పెట్రోల్, సావధాన్ ఇండియా వంటివి చూస్తూ ఉండేవి. అందులో ఆత్మహత్య చేసుకునే పద్ధతిని చూసి ఉండవచ్చని బాలిక కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలిక తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఒక ఫంక్షన్ కు వెళుతున్నారు. బాలికను కూడా తమతో రావాలని కోరారు. అయితే ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆమె నిరాకరించింది. మధ్యాహ్న సమయంలో కుటుంబసభ్యులు ఈవెంట్‌ నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. ఆపై బాలిక గది తలుపులు మూసి ఉండడం చూశారు. తలుపు తెరవాలని పిలుస్తూ వారు తలుపు తట్టారు, కానీ లోపల ఉన్న అమ్మాయి స్పందించలేదు. గదిలోంచి శబ్దం రాలేదు.

దీంతో ఆ కుటుంబం కిటికీలోంచి తొంగి చూసింది. ఆ సమయంలో బాలిక సీలింగ్ హుక్‌కు వేలాడుతూ కనిపించింది. ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సావధాన్ ఇండియా మరియు క్రైమ్ ప్యాట్రోల్ చూడటం అమ్మాయికి చాలా ఇష్టం. ఆమె రోజంతా ఈ సీరియల్స్ చూసేది. ఆ షోల నుండి ఎలా ఆత్మహత్య చేసుకోవాలో చూసి ఉండొచ్చనికుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పలువురిని ప్రశ్నిస్తున్నారు.

Next Story