తాడిపర్తి సీఐ సూసైడ్‌పై జేసీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి డైలాగ్‌ వార్

తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య పొలిటికల్ టర్న్‌ తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on  3 July 2023 7:08 AM GMT
CI Ananda Rao, Suicide, JC Prabhakar, MLA KethiReddy PeddaReddy,

తాడిపర్తి సీఐ సూసైడ్‌పై జేసీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి డైలాగ్‌ వార్

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి టౌన్‌ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సీఐ డెడ్‌బాడీకి నివాళులర్పించేందుకు వెళ్లిన తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ఆనందరావు బాధ్యతలు తీసుకున్న 9 నెలల కాలంలోనే సుమారు 5 నెలల నుంచి వైసీపీ నాయకులు ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. వైసీపీ లీడర్లను కొన్ని కేసుల్లో తప్పించాలని సీఐగా ఆనందరావుపై ఒత్తిడి చేసినట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. వైసీపీ నాయకుల ఒత్తిళ్లను తట్టుకోలేకే సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

ఇక జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపణలపై స్పందించారు తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఆయన ఆరోపణలను ఖండించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని కేతిరెడ్డి మండిపడ్డారు. వైసీపీపై ఆరోపణలు చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలీసులను ఎంత ఇబ్బంది పెట్టేవారో అందరికీ తెలుసన్నారు. ఏదేమైనా సీఐ ఆనందరావు ఆత్మహత్య బాధాకరమని.. సూసైడ్‌ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేలా ఉన్నతాధికారులను కోరుతామని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు.

కాగా.. పని ఒత్తిడే తన తండ్రి ప్రాణం బలిగొందని ఆయన కుమార్తె భవ్య కన్నీరు పెట్టుకుంది. కానీ జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యలు పొలిటికల్ టర్న్‌ తీసుకునేలా చేశాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పారు.

Next Story