చెల్లిని ప్రేమిస్తున్న వ్య‌క్తిని హ‌త్య చేసిన అన్న‌

సంగారెడ్డిలో దారుణ హత్య చోటు చేసుకుంది. చెల్లిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో యువకుడ్నిచంపిన అన్నయ్య.

By News Meter Telugu  Published on  19 July 2023 8:15 PM IST
brother killed, young man, Sangareddy,

చెల్లిని ప్రేమిస్తోన్న యువకుడ్ని హత్యచేసిన ఆమె అన్నయ్య


సంగారెడ్డిలో దారుణ హత్య చోటు చేసుకుంది. తన చెల్లిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో ఒక యువకుడ్ని ఆమె అన్నయ్య హత్య చేశాడు. అది కూడా అందరూ చూస్తుండగా ఈ హత్య చేశాడు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పిచ్చరేగడి తండాలో సుదీప్ (19) అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. కొంతకాలం నుంచి అతడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అతడి ప్రేమ విషయం యువతి సోదరుడు అరుణ్‌కి (19) తెలిసింది. అప్పటి నుంచి అతడు సుదీప్‌పై కక్ష పెంచుకున్నాడు. తన చెల్లి జోలికి అతడు రాకుండా ఉండాలంటే చంపేయడమే దారి అని అనుకున్నాడు.

కోపంతో సుదీప్‌ని హతమార్చేందుకు అరుణ్ గొడ్డలి తీసుకుని వెళ్ళాడు. నా చెల్లెలినే ప్రేమిస్తావా? అంటూ గొడ్డలితో తలపై వేటు వేశాడు. దీంతో సుదీప్ అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. అతడు దాడి చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్లు చోద్యం చూస్తూ ఉండిపోయారే తప్ప ఆపడానికి ప్రయత్నించలేదు. సుదీప్ చనిపోయాడని నిర్ధారించుకొని, అరుణ్ అక్కడి నుంచి పారిపోయాడు. సుదీప్ మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అరుణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story